Kerala Nurse Vs Yemen: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమన్‌లోని ఓ కోర్టు మరణశిక్షను విధించింది. యెమన్‌లో ఉపాధి కోసం వెళ్లిన నిమిషా.. అక్కడి ఓ పౌరుడిని మర్డర్ చేసింది. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష పడింది. వాస్తవానికి ఈ కేసు చాలా పాతది. 2017 నుంచి నిమిషా ప్రియ జైలులోనే ఉంది. అయితే ఆమెకు మరణశిక్షను విధించే ప్రతిపాదనను యెమన్ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి సోమవారం ఆమోదం తెలిపారు. చనిపోయిన యెమన్ జాతీయుడి కుటుంబీకులు క్షమిస్తున్నామని ప్రకటిస్తే తప్ప.. మరో నెల రోజుల్లోగా నిమిషా ప్రియను ఉరితీస్తారు.
Also Read :Fraud Couple : ఫ్రాడ్ కపుల్.. ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శి కూతురినంటూ మోసం
ఈ తరుణంలో నిమిషా ప్రియకు ఉరిశిక్ష అంశంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిషాకు సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని తమ తరఫున అందించే ప్రయత్నం చేస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. నిమిషా కుటుంబాన్ని కూడా ఆదుకుంటామన్నారు. వారి కుటుంబీకులు తమను సంప్రదించి, నిమిషాకు సాయం చేయమని కోరారని జైస్వాల్ తెలిపారు. నిమిషా కుటుంబం అనుభవిస్తున్న వేదనను తాము అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు.
Also Read :Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌లో ఎన్నికల వేడి.. అభ్యర్థుల ప్రచార హోరు
నిమిషా ప్రియ(Kerala Nurse Vs Yemen) కేరళలోని పాలక్కడ్ జిల్లా వాస్తవ్యురాలు. ఆమె ఉపాధి కోసం 2008లో యెమన్‌కు వెళ్లారు. తొలుత కొన్నాళ్ల పాటు ఆమె యెమన్‌లోని కొన్ని ఆస్పత్రుల్లో పనిచేసింది. 2015లో తన సొంత క్లినిక్‌ను ప్రారంభించింది. ఈక్రమంలో తన వ్యాపార భాగస్వామిగా యెమన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని ఎంచుకుంది. అనంతరం 2017 జులైలో క్లినిక్ విషయంలో నిమిషా ప్రియ, తలాల్ అబ్దో మెహదీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలోనే నిమిషా చేసిన దాడిలో తలాల్ అబ్దో మెహదీ చనిపోయాడు. అనంతరం యెమన్ నుంచి పారిపోయేందుకు నిమిషా ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు. ఈ కేసుపై సనాలోని ట్రయల్ కోర్టు 2020లో తీర్పు ఇచ్చింది. నిమిషాకు మరణశిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ తీర్పును నిమిషా యెమన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌లో సవాల్ చేశారు. అయితే ఆమె పిటిషన్‌ను యెమన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ 2023 నవంబరులో తిరస్కరించింది.
వాళ్లు క్షమిస్తే మరణశిక్ష రద్దు..
నిమిషా చేతిలో హత్యకు గురైన తలాల్ అబ్దో మెహదీ, వారి గిరిజన తెగ నాయకుడు ఆమెను క్షమిస్తే మరణశిక్ష రద్దయ్యే ఛాన్స్ మిగిలి ఉంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా కొంతకాలం పాటు జరిగినట్లు తెలుస్తోంది. అయితే నిమిషా ప్రియ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదికి చెల్లింపులు జరగక.. ఆ ప్రక్రియ ఆగిపోయింది. భారత విదేశాంగ శాఖ ఆ న్యాయవాదికి చెల్లింపులు చేస్తే.. చనిపోయిన వ్యక్తి కుటుంబంతో రాజీ చర్చలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంటుంది. నిమిషా ప్రియ తరఫు న్యాయవాది ప్రీ నెగోషియేషన్ ఫీజుగా రెండు విడతలలో రూ.34 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆ డబ్బును ఇస్తే తప్ప తాను కేసును వాదించనని ఆ లాయర్ చెబుతున్నట్లు తెలిసింది. నిమిషా ప్రియ తల్లి ప్రేమ కుమారి 2024 ఏప్రిల్‌లో యెమన్‌కు వెళ్లారు. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా అక్కడి జైలులో ఉన్న తన కుమార్తె నిమిషను ఆమె కలుసుకున్నారు. అప్పటి నుంచి ఆమె యెమన్‌లోనే ఉంటూ తన కూతురి విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.