తమిళ రాజకీయాలన్నా, చిత్రపరిశ్రమన్నా ఓ భిన్నమైన గుర్తింపు కలిగిన ఎం.కె. ముత్తు ( Muthu Passes away) ఇక లేరనే వార్త తమిళనాడులోని రాజకీయ వర్గాలను, సినీ ప్రియులను విషాదంలో ముంచింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (Karunanidhi) పెద్ద కుమారుడు ముత్తువేల్ కరుణానిధి ముత్తు (ఎం.కె. ముత్తు) 77 ఏళ్ల వయస్సులో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించారు. ఎం.కె. ముత్తు జననం 1948 జనవరి 14న కరుణానిధి మొదటి భార్య పద్మావతికి జన్మించారు.
తండ్రి కళాభిరుచిని ముదిరేలా, ముత్తు కూడా తొలుత నాటకాల వేదికలపై మెరుస్తూ, అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టారు. 1970లలో ‘పిళ్ళైయో పిళ్ళై’, ‘పూకారి’, ‘షయాలికారన్’, ‘దమయ విల్లుక్కు’ వంటి చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా డీఎంకే వేదికలపై పాటలు పాడుతూ ప్రజల మద్దతును కూడగట్టడంలో ముందుండేవారు. ముఖ్యంగా ఎంజీఆర్‌కు పోటీగా ముత్తును సినీ రంగంలోకి తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నటన, రూపురేఖల పరంగా ఎంజీఆర్ స్థాయిలో ఉన్నాడని అప్పట్లో అభిమానులు కొనియాడేవారు.
TTD : తిరుమల వెళ్లే భక్తులు ఇకపై వసతుల కోసం చింతించాల్సిన అవసరం లేదు..ఎందుకంటే !
తొలితరం నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉండే అవకాశం ఉన్నా, పార్టీ అంతర్గత పరిణామాలు, వ్యక్తిగత కారణాలతో ముత్తు రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం పొందలేదు. తండ్రి కరుణానిధికి మూడు వివాహాలు అవ్వగా ముత్తు మొదటి భార్య పద్మావతికి జన్మించిన ఏకైక కుమారుడు. ముత్తుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కుమారుడు అరివునిధి, కుమార్తె తెన్ మొళి. ప్రస్తుతం తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ముత్తుకి సోదరుడు. మరణ సమయంలో ముత్తు చెన్నైలోని ఇంజంబక్కం నివాసంలో ఉంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచారు.
ముత్తు మృతిపై పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. డీఎంకే తరఫున ఉన్న అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేయడమే కాకుండా, పార్టీ నాయకత్వం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.