Gali Janardhan Reddy : బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ విలీనం.. ఎందుకు ?

Gali Janardhana Reddy : మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్లీ బీజేపీలో చేరారు.

Published By: HashtagU Telugu Desk
Gali Janardhana Reddy

Gali Janardhana Reddy

Gali Janardhan Reddy : మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్లీ బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాక.. 2022 సంవత్సరంలో తాను ఏర్పాటు చేసిన కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పార్టీని ఇవాళ కమల దళంలో విలీనం చేశారు. సోమవారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసమే మళ్లీ తాను బీజేపీలో చేరానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. నరేంద్రమోదీని మూడోసారి దేశ ప్రధానిగా చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ఎలాంటి షరతులు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ టికెట్ ఆఫరేదీ తనకు బీజేపీ నుంచి రాలేదని .. తాను కూడా అలాంటివేం అడగలేదని తేల్చి చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా అంకితభావంతో నిర్వర్తిస్తానని జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయానికి తనవంతుగా పాటుపడతానన్నారు.

We’re now on WhatsApp. Click to Join

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందంటే.. 

2023 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటిలో తన సొంత పార్టీ కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) ద్వారా గాలి జనార్దన్ రెడ్డి పోటీ చేశారు.  హరపనహళ్లి, బళ్లారి సిటీ నుంచి బీజేపీ టికెట్లపై పోటీచేసిన తన ఇద్దరు సోదరులు జి.కరుణాకర రెడ్డి, జి.సోమశేఖర రెడ్డిల ఓటమిలో గాలి జనార్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బళ్లారి సిటీలో తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి సోమశేఖర రెడ్డిపై భార్య అరుణలక్ష్మిని గాలి జనార్దన్ రెడ్డి బరిలోకి దింపారు. దీంతో ఓట్ల చీలిక జరిగి అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి విజయం సాధించారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు పలికారు. ఈ పరిణామాలన్నీ గమనించిన బీజేపీ అధిష్టానం..గాలి జనార్దన్ రెడ్డి తమవైపు ఉంటే వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని భావించింది. గత వారమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గాలి జనార్దన్ రెడ్డితో  చర్చలు జరిపి బీజేపీలో కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పార్టీ విలీనం జరిగేలా చూశారు.  ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి కీలక అనుచరుడిగా ఉన్నశ్రీరాములు ఈసారి బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి చేరికతో బళ్లారి, కొప్పళ, విజయనగరం, రాయచూరు జిల్లాల్లో బీజేపీకి లాభం చేకూరుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

Also Read :Talasani Srinivas Yadav: కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్

  Last Updated: 25 Mar 2024, 11:58 AM IST