సిక్కు విద్యార్థులు తలపాగా ధరించి విద్యా సంస్థలకు హాజరు కావచ్చని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధరించి రాకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు సిక్కులకు వర్తించదంటూ క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తలపై ముసుగు వేసుకొని రాకూడదంటూ బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ ఓ సిక్కు విద్యార్థినికి సూచించింది. కాలేజీ స్టేట్ మెంట్ తో ఈ ఆదేశాలపై కన్ఫ్యూజన్ ఏర్పడింది.
ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నగేష్ స్పందించి వివరణ ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులు సిక్కు విద్యార్థులకు వర్తించవని చెప్పారు. తలపాగాలు ధరించుకోవచ్చంటూ రాజ్యాంగమే వారికి వెసులుబాటు కల్పించిందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం వారికి ఆ హక్కు ఉందని చెప్పారు. దీనిపై కళాశాల యాజమాన్యం కూడా వివరణ ఇచ్చింది.
ముసుగు తొలగించాలని తామేమీ ఆ విద్యార్థినిపై ఒత్తిడి తీసుకురాలేదని చెప్పింది. ముసుగు ధరించడం హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని కొందరు విద్యార్థులు చెప్పడంతో ఆ విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చామని తెలిపింది.
కాలేజీ మేనేజ్‌మెంట్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. తమకు రాజ్యాంగం పరంగా ఉన్న హక్కును వివరించడంతో ఏకీభవించిందని తెలిపారు.
తుది తీర్పు వచ్చే వరకు మత పరమైన చిహ్నాలతో తరగతులకు హాజరు కాకూడదని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దాని అమలు విషయంలోనూ ఈ సమస్య తలెత్తింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించడంతో ఆ వివాదం ఇక్కడితో సద్దుమణిగింది.