Indian Nurse : యెమన్ దేశపు పౌరుడిని హత్య చేసిన కేసులో మరణశిక్ష పడిన భారత్‌లోని కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను ఆదుకునేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. మానవతా కోణంలో ఆమెకు ఆపన్న హస్తం అందించేందుకు యెమన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సీనియర్ అధికారి ఒకరు ముందుకొచ్చారు. ‘‘మానవతా కోణంలో మేం చేయగలిగినదంతా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని సదరు ఇరాన్ సీనియర్ అధికారి ప్రకటించారు.
Also Read :Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు
నిమిషా ప్రియ తల్లి ప్రస్తుతం యెమన్‌లోనే ఉన్నారు. తన కూతురిని మరణశిక్ష నుంచి కాపాడుకునేందుకు ఆమె అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే యెమన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులను కూడా నిమిషా ప్రియ(Indian Nurse) తల్లి కలిశారు. తప్పకుండా సాయం అందిస్తామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యెమన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం వైపు నుంచి సహాయంపై ప్రకటన వెలువడటం గమనార్హం. ఇరాన్‌తో యెమన్ ప్రభుత్వానికి బలమైన సంబంధాలు ఉన్నాయి. యెమన్‌పై పశ్చిమ దేశాల ఆంక్షలు ఉన్నా వెరవకుండా.. ఆ దేశానికి ఆయుధాలను ఇరాన్ అందిస్తోంది. యెమన్‌లోని హౌతీ రెబల్స్ వద్దనున్న ఆయుధాలన్నీ ఇరాన్‌కు చెందినవే. ప్రస్తుతం ఇజ్రాయెల్‌పై యుద్ధంలో యెమన్ హౌతీలు, ఇరాన్ కలిసికట్టుగా ముందుకుసాగుతున్నాయి. అందుకే ఇరాన్ రాయబార కార్యాలయం వైపు నుంచి వెళ్లే సిఫారసులపై యెమన్ ప్రభుత్వ వర్గాలు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉంటాయి.
Also Read :Pawars Reunion : ఏకం కానున్న ఇద్దరు పవార్లు ? అజిత్ పవార్ తల్లి కీలక వ్యాఖ్యలు
అదే జరిగితే మన దేశానికి చెందిన నిమిషా ప్రియకు మరణశిక్ష గండం తప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిమిషా ప్రియ చేతిలో హత్యకు గురైన యెమన్ జాతీయుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబీకులు క్షమించినా.. ఆమె మరణశిక్ష రద్దవుతుంది. మరోవైపు భారత్ కూడా ఈవిషయంపై ఫోకస్ పెట్టింది. నిమిషా ప్రియ తరఫున కేసును వాదిస్తున్న న్యాయవాది భారీగా డబ్బును డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి అతడు కేసును వాదించడం ఆపేశాడు. ఈవిషయంలో తమను ఆదుకోవాలని నిమిషా ప్రియ తల్లి వేడుకుంటున్నారు. ఈ దిశగా భారత ప్రభుత్వం ఏవిధమైన చొరవ చూపుతుందో వేచిచూడాలి.