Site icon HashtagU Telugu

Projects: అభివృద్ధి ప‌థంలో భార‌త్‌.. ఈ ప్రాజెక్టులే నిద‌ర్శ‌నం!

Projects

Projects

Projects: 2025లో అభివృద్ధి దిశ‌గా దూసుకెళ్లేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది. దేశంలో నిర్మాణంలో ఉన్న అనేక పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రవాణాను వేగవంతం చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో, రైలు, పవర్ ప్రాజెక్టులు (Projects) వీటిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం.

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే

భారతదేశంలోని అత్యంత పొడవైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ 1400 కి.మీ పొడవైన 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మీదుగా వెళుతుంది. దీని నిర్మాణంతో ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గనుంది.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వే

జనవరి 2025 నాటికి పూర్తి కానున్న ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల 235 కిలోమీటర్ల దూరం 210 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణ సమయం కేవలం రెండున్నర గంటలు మాత్ర‌మే. 12,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆసియాలోనే అతి పొడవైన ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్ కూడా ఉంది.

Also Read: Norovirus: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌రో వైర‌స్‌.. దీని ల‌క్ష‌ణాలు ఇవే!

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం

నోయిడాలోని జెవార్‌లో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఏప్రిల్ 2025లో మొదటి ప్రయాణీకుల విమానానికి సిద్ధంగా ఉంటుంది. ఇది దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఇది రూపొంద‌నుంది.

RRTS, ఢిల్లీ మెట్రో

ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS నిర్మాణం చివరి దశలో ఉంది. ఇది జనవరి 2025లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ కారిడార్ సరాయ్ కాలే ఖాన్ నుండి మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని గంట కంటే తక్కువకు తగ్గిస్తుంది. అదే సమయంలో ఢిల్లీ మెట్రో తన నాల్గవ దశ కింద 86 కిలోమీటర్ల కొత్త లైన్లపై పని చేస్తోంది. వీటిలో 40 కిలోమీటర్లు భూగర్భ కారిడార్లుగా ఉంటాయి.

కాశ్మీర్ లోయ నుండి ఢిల్లీకి నేరుగా రైలు సర్వీసు

కాశ్మీర్ లోయ నుండి ఢిల్లీకి అనుసంధానించే డైరెక్ట్ రైలు సర్వీసు జనవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. ఈ రైలు మార్గం శ్రీనగర్-ఢిల్లీ మధ్య 800 కిలోమీటర్ల దూరాన్ని 13-15 గంటల్లో కవర్ చేస్తుంది.

విద్యుత్, రియల్ ఎస్టేట్

2025లో దేశవ్యాప్తంగా 24×7 విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వేసవిలో విద్యుత్ డిమాండ్ 270 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇందుకోసం బొగ్గు, జలవిద్యుత్ ప్రాజెక్టులను శరవేగంగా విస్తరిస్తున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా 2025లో 6-15% ధరల పెరుగుదలను చూసే అవకాశం ఉంది.

2047 లక్ష్యం దిశగా భారత్

ఈ ప్రాజెక్టులు పూర్తయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యం దిశగా భారత్ వేగంగా దూసుకుపోతుంది. 2025 సంవత్సరం భారతదేశ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిల‌వ‌నుంది.