HD Kumaraswamy : మాజీ ప్రధాని కుమారుడితో నువ్వానేనా ? ఆ స్థానంలో పోటీ రసవత్తరం !

HD Kumaraswamy : మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ఈసారి పోటీ చేస్తున్న మాండ్య లోక్‌సభ స్థానం వైపే అందరి చూపు ఉంది.

  • Written By:
  • Updated On - April 14, 2024 / 03:03 PM IST

HD Kumaraswamy : హెచ్‌డీ కుమారస్వామి.. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు. ఆయన ఈసారి మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేడీఎస్, బీజేపీల మద్దతు ఆయనకు ఉంది. అంతేకాదు .. మాండ్య సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ నటి సుమలత కూడా కుమార స్వామికి మద్దతు ప్రకటించారు. మాండ్య ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉన్న వొక్కలిక సామాజిక వర్గానికి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడపై ఉన్న అభిమానం కూడా కుమారస్వామికి(HD Kumaraswamy) కలిసొచ్చే అవకాశం ఉంది. వొక్కలిక సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వొక్కలిగలకు గుండెకాయగా పేరొందిన మాండ్య స్థానాన్ని కాంగ్రెసే గెలవాలనే లక్ష్యంతో ఆయన కూడా పెద్దఎత్తున స్థానికంగా ప్రచారం చేయనున్నారు. గత ఎన్నికల వేళ డీకే శివకుమార్‌కు సీఎం సీటు ఇవ్వలేదనే విస్మయం వొక్కలిగ వర్గంలో బలంగా ఉంది. దీన్ని ఈ ఎన్నికల్లో ఆ వర్గం ఓటర్లు ఏవిధంగా తెలియజేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join

మాండ్య ఎన్నికల బరిలో హెచ్‌డీ కుమారస్వామితో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు (వెంకట రమణె గౌడ) కు చరిష్మా తక్కువే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటకలోని గౌరిబిదనూరుకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే కెహెచ్ పుట్టస్వామి గౌడ్ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. దీనికి ప్రతిగా పుట్టస్వామి సోదరుడు స్టార్ చంద్రుకు కాంగ్రెస్ పార్టీ మాండ్య లోక్‌సభ టికెట్‌ను కేటాయించింది. స్టార్ చంద్రు ఒక కాంట్రాక్టర్.  ప్రత్యేకించి నటి సుమలత చరిష్మా ఈసారి కుమారస్వామికి కలిసి రానుంది. సిట్టింగ్ ఎంపీగా సుమలతకు మాండ్య పరిధిలో చరిష్మా ఒక్కటే కదా.. రాజకీయ ప్రాబల్యం కూడా బలంగానే ఉంది. 2019 మాండ్య లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ – జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేసి ఓడిపోయారు. ఆనాడు సుమలతకు దాదాపు 1.25 లక్షల ఓట్ల ఆధిక్యం వచ్చింది. అటువంటి  బలమైన నాయకురాలిగా సుమలత మద్దతు కుమార స్వామికి ఎంతో కలిసిరానుంది. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుమలత.. ఎన్‌డీఏ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్‌కు తన సీటును వదులుకున్నారు. దీంతో మాండ్య నుంచి బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా కుమారస్వామి బరిలోకి దిగారు.

Also Read : Car Tips For Summer: మీకు కారు ఉందా..? అయితే వేసవిలో ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే..!

మాండ్య లోక్‌సభ స్థానం పరిధిలోని మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. జేడీఎస్‌, సర్వోదయ కర్ణాటక పక్షకు చెరో ఎమ్మెల్యే ఉన్నారు. మాండ్య లోక్‌సభ స్థానం పరిధిలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్నారు. అదనంగా ఇద్దరు ఎమ్మెల్సీల బలం కూడా హస్తం పార్టీకి ఉంది. ఈ కోణంలో చూస్తే.. హెచ్‌డీ కుమారస్వామికి విజయం అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే ప్రస్తుతం మెజారిటీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును జేడీఎస్ గెలవగలిగింది. ఇంత తక్కువ ప్రాబల్యంతో .. ఇప్పుడు ఏకంగా లోక్‌సభ సీటును చేజిక్కించుకోవడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పదేళ్ల పెద్ద గ్యాప్ తర్వాత ఈసారి మాండ్యాను ఎలాగైనా గెల్చుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది.

Also Read :Diabetes: మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తుల‌కు రాగులు ఎంత వ‌ర‌కు మేలు చేస్తాయి..?