Death Penalty To Greeshma : ఆమె ప్రియుడికి నమ్మక ద్రోహం చేసింది. కషాయంలో విషం కలిపి ఇచ్చి అతడితో తాగించింది. దీంతో అతడు 11 రోజుల్లోనే చనిపోయాడు. ఈ హత్యకు పాల్పడిన మహిళ పేరు గ్రీష్మ. చనిపోయిన వ్యక్తి పేరు 23 ఏళ్ల షారన్ రాజ్. అతడు రేడియాలజీ విద్యార్థి. 2022లో కేరళలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ మర్డర్ కేసులో కేరళలోని నెయ్యత్తింకర అదనపు సెషన్స్ కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. దోషిగా తేలిన షారన్ రాజ్ ప్రియురాలు గ్రీష్మకు మరణశిక్షను విధించింది. ఈ కేసులోని మరో దోషి గ్రీష్మ మామ నిర్మలా కుమారన్ నాయర్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది.
Also Read :Professor Shanthamma : జేడీ వాన్స్, ఉష దంపతులకు శాంతమ్మ అభినందనలు.. ఈమె ఎవరు ?
గ్రీష్మ చేసింది నమ్మకద్రోహం
ఈసందర్భంగా నెయ్యత్తింకర అదనపు సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాయ్ ఫ్రెండ్ షారన్‌కు గ్రీష్మ(Death Penalty To Greeshma) నమ్మక ద్రోహం చేసిందని కామెంట్ చేసింది. కుట్రపూరితంగానే అతడికి ఇచ్చిన కషాయంలో హానికారక పదార్థాలు కలిపిందని పేర్కొంది. గ్రీష్మను షారన్ ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదని న్యాయస్థానం గుర్తుచేసింది. అయినా అతడి ప్రాణాలు తీసే విషాన్ని అందించడం అనేది ముమ్మాటికీ నేరమేనని కోర్టు పేర్కొంది. ‘‘గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగిన తర్వాత షారన్‌కు వాంతులు అయ్యాయి. దీంతో ఆ కషాయం వీడియోను రికార్డ్ చేస్తానని షారన్ చెప్పాడు. అయితే అందుకు గ్రీష్మ నో చెప్పింది. అందులో ఏదో కలిపారు అనేందుకు ఆమె మాటలే సాక్ష్యం’’ అని కోర్టు తెలిపింది. 11 రోజుల పాటు కనీసం చుక్క నీరు కూడా తాగలేని స్థితిలో ప్రాణాలతో పోరాడి షారన్ చనిపోయాడని న్యాయస్థానం పేర్కొంది.
అసలు ఏం జరిగింది అంటే..
గతంలోకి వెళితే.. షారన్, గ్రీష్మ చాలా ఏళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తదుపరిగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో షారన్‌తో తన సంబంధాన్ని ముగించాలని గ్రీష్మ నిర్ణయించుకుంది. అయితేే బ్రేకప్‌కు షారన్ నిరాకరించాడు. ఈక్రమంలో 2022 అక్టోబర్ 14న షారన్ తన ఫ్రెండ్ రెజిన్‌తో కలిసి కన్యాకుమారిలోని రామవర్మంచిరైలో ఉన్న గ్రీష్మ ఇంటికి వెళ్లాడు. గ్రీష్మ పురుగుమందు కలిపిన ఆయుర్వేద కషాయాన్ని అతడికి ఇచ్చింది. దాన్ని షారన్ తాగి వాంతులు చేసుకున్నాడు. వైద్యపరీక్షలు చేయించుకోగా.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి కారణమయ్యే యాసిడ్‌ని అతడికి ఇచ్చారని తేలింది. అదే ఏడాది అక్టోబర్ 25న షారోన్ గుండెపోటుతో షారన్ తుదిశ్వాస విడిచాడు. ఫోరెన్సిక్ పరీక్షల్లోనూ ఈవిషయం తేలింది.