CM Vs Governor : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కి చెందిన భూములను తన భార్యకు కట్టబెట్టారనే అభియోగాల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనను విచారించేందుకు అనుమతులు మంజూరు చేస్తూ గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు విచారించింది. కర్ణాటక సీఎం పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ కొట్టివేసింది. గవర్నర్, సీఎం, ఇతర పిటిషనర్ల తరఫు వాదనలు విన్న అనంతరం హైకోర్టు బెంచ్ (CM Vs Governor) ఈ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆదేశాలు చట్టప్రకారమే ఉన్నాయని, వాటిలో లోపం ఏదీ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఎంను విచారించాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాల్లో చట్ట వ్యతిరేక చర్య ఏదీ లేదని తేల్చి చెప్పింది. సీఎం సిద్ధరామయ్య తరఫున అభిషేక్ మను సింఘ్వి చేసిన వాదనలను హైకోర్టు బెంచ్ తోసిపుచ్చింది.
Also Read :China Vs Israel : లెబనాన్ భద్రతకు సహకరిస్తాం.. చైనా కీలక ప్రకటన
గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం ఇచ్చిన ఫిర్యాదుతో ముడా ల్యాండ్ స్కాం వ్యవహారం తెరపైకి వచ్చింది. ‘ముడా’ స్థలాలను తమ కుటుంబసభ్యులకు సీఎం సిద్ధరామయ్య అక్రమంగా కేటాయించారని ఆయన ఆరోపించారు. ఈవిధమైన అక్రమ భూకేటాయింపుల కోసం తన అధికారాన్ని సీఎం దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన మరో ఇద్దరిలో స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ కూడా ఉన్నారు. వీరందరి కంప్లయింట్స్ ఆధారంగా ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read :Encounter : ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. అనుమానితుడి ఎన్‌కౌంటర్..!
అయితే కర్ణాటక మంత్రి వర్గం ఈ ఆదేశాన్ని వ్యతిరేకించింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని గవర్నర్‌కు సూచించింది. అయితే కర్ణాటక మంత్రివర్గం సూచనను గవర్నర్ తోసిపుచ్చారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్య వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగా తనను లక్ష్యంగా ఎంచుకున్నారని రాష్ట్ర గవర్నర్‌పై ఆయన ఆరోపణ చేశారు. అయితే హైకోర్టు తొలుత కొన్ని వారాల పాటు సీఎం సిద్ధరామయ్యకు ఊరట కల్పించింది. అప్పటివరకు ఆయనను విచారించకూడదని తెలిపింది. తాజాగా ఇవాళ దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఎం సిద్ధరామయ్య విచారణకు సహకరించాల్సిదే అని స్పష్టం చేసింది.