Kasthuri Shankar : నటి కస్తూరి శంకర్ ఏమయ్యారు ? ఆమె పరారీలో ఉన్నారా ? అంటే.. చెన్నై పోలీసు వర్గాలు ఔను అనే సమాధానమే చెబుతున్నాయి. తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిని ఉద్దేశించి కస్తూరి ఇటీవలే అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు సంఘాలు ఆమెపై తమిళనాడులోని చెన్నై, మదురై సహా పలుచోట్ల ఫిర్యాదు చేసి, కేసులు నమోదు చేయించాయి. 192, 196(1ఏ)3 53 ,353(2) సెక్షన్‌ల కింద కస్తూరిపై కేసులు నమోదయ్యాయి.
Also Read :Group 3 : తెలంగాణ గ్రూప్ – 3 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన తమిళనాడు పోలీసులు కస్తూరికి సమన్లు జారీచేయాలని నిర్ణయించారు. విచారణకు హాజరై.. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆ సమన్లలో ప్రస్తావించారు. తీరా సమన్లు ఇచ్చేందుకు కస్తూరి ఇంటికి చెన్నై పోలీసులు వెళ్లగా.. ఇంటికి తాళం వేసి ఉంది. ఆమెకు ఫోన్ కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో కస్తూరి ఇంటి వద్ద నుంచి పోలీసులు వెనుదిరిగారు. కస్తూరి పరారీలో ఉందని గుర్తించిన పోలీసులు.. ఆమె కోసం గాలిస్తున్నారు. ఎవరైనా బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఆమె ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసే ప్రయత్నం జరుగుతోంది. కస్తూరి(Kasthuri Shankar) తమిళనాడు విడిచి వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కస్తూరి పరిచయమయ్యారు. ఆమె పలు సినిమాల్లో కూడా నటించారు. ఓ తెలుగు సీరియల్‌లోనూ లీడ్ రోల్‌లో నటించారు.
Also Read :Dev Deepawali : నవంబరు 15 వర్సెస్ 16.. ‘దేవ్ దీపావళి’ ఎప్పుడు ?
కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు ఇవీ..
ఇటీవలే తమిళనాడులో జరిగిన బ్రాహ్మణుల సమ్మేళనానికి కస్తూరి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె తెలుగువారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లు. అలా వచ్చిన వాళ్లంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’’ అని కస్తూరి కామెంట్ చేశారు. అయితే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ఆమె ఇప్పటికే ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. తన వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను గాయపరిచినట్లయితే వారికి క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు. తెలుగు ప్రజలు అంటే తనకు గౌరవమని, వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు.