Vijay Vs DMK : తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ తన చేతి రాతతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. టీవీకే లెటర్ హెడ్‌తో ఈ లేఖను పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రిలీజ్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని మహిళా లోకాన్ని “ప్రియమైన సోదరీమణులారా” అని సంబోధిస్తూ ఈ లేఖను ఆయన రాశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని ఎవరిని అడగాలని ఈ లేఖలో విజయ్ ప్రశ్నించారు. “మీ (మహిళల) భద్రత గురించి మేం ఎవరిని ప్రశ్నించాలి? మనల్ని పాలించే వాళ్లను ఎన్నిసార్లు అడిగినా అర్ధం పర్ధం లేదని తెలిసింది. అందుకే ఈ లేఖ రాశాను” అని ఆయన పేర్కొన్నారు.
Also Read :Pushpa 2 Collections : ‘పుష్ప 2 ది రూల్’ 25వ రోజు ఎన్ని కలెక్షన్స్ సాధించిందంటే..
‘‘తమిళనాడులో విద్యాసంస్థలతో సహా చాలాచోట్ల నిత్యం మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. వారిపై దాడులు జరుగుతున్నాయి. మీ అందరి సోదరుడిగా నేను డిప్రెషన్‌కు గురవుతున్నాను. మీకు మాటల్లో చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నాను. తమిళనాడులో మహిళలు ఎదుర్కొంటున్న బాధలన్నీ సమసిసోవాలని కోరుకుంటున్నాను’’ అని లేఖలో విజయ్(Vijay Vs DMK) ప్రస్తావించారు. ‘‘ఎలాంటి పరిస్థితి వచ్చినా.. సోదరుడిలా నేను మీకు అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. విద్యార్థినులారా మీరు దేని గురించీ చింతించకండి. మీ చదువులపై దృష్టి పెట్టండి. సురక్షితమైన తమిళనాడును మేం సృష్టిస్తాం. మనమంతా కలిసి త్వరలో దీన్ని సాధిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read :Prashant Kishor : ప్రశాంత్ కిశోర్‌పై కేసు.. బీపీఎస్‌సీ అభ్యర్థులను రెచ్చగొట్టారనే అభియోగం
డిసెంబరు 23న అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో ఈ అంశాలను లేవనెత్తుతూ ఆయన లేఖను విడుదల చేశారు. ఇదే అంశంపై వినూత్న నిరసన తెలుపుతూ శుక్రవారం ఉదయం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై తనను తాను కొరడాతో కొట్టుకున్నారు. అన్నా డీఎంకే పార్టీ నాయకులు సైతం నిరసనలు నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడానికి డీఎంకే పార్టీ పాలనా వైఫల్యమే కారణమని ఆరోపించారు. అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి కేసులో 37 ఏళ్ల నిందితుడు జ్ఞానశేఖరన్‌కు అధికార పార్టీ డీఎంకేతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ, అన్నాడీఎంకే విమర్శించాయి.