Site icon HashtagU Telugu

Post Office Schemes: బెస్ట్‌ ఇంట్రెస్ట్‌ రేట్ ఉన్న 3 పోస్టాఫీసు పథకాలు

Post Office Scheme

Post Office Scheme

గత కొన్ని నెలలుగా, ఎత్తుపల్లాల రోడ్‌ మీద భారత స్టాక్ మార్కెట్‌ బండి పరుగులు తీస్తోంది. సాధారణంగా, తమ కష్టార్జితాన్ని పణంగా పెట్టి ఎవరూ రిస్క్‌ చేయరు. కాబట్టి, ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు పోస్టాఫీసు వైపునకు మళ్లుతున్నాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Post Office small savings schemes) ఇన్వెస్ట్ చేయడం ద్వారా, దీర్ఘకాలంలో హామీతో కూడిన మంచి రాబడిని సులభంగా పొందవచ్చు.

ముచ్చటగా 3 ప్లాన్స్‌

ప్రజల అనేక అవసరాలకు అనుగుణంగా ఉన్న 3 పోస్టాఫీసు పొదుపు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవి.. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (RD), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (POTD), పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC). టైమ్ డిపాజిడ్‌ మినహా మిగిలిన 2 పథకాలు 5 సంవత్సరాల లాక్-ఇన్‌తో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి కాబ్టటి, ఈ పథకాల్లో  పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. పైగా, వీటిలో 2 పథకాలకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది.

పోస్టాఫీసు (Post Office) RD ఖాతా

5 సంవత్సరాల కాల గడువుతో, రాబడి హామీతో కూడిన సురక్షితమైన పెట్టుబడి కోసం మీరు చూస్తున్నట్లయితే.. ఈ పోస్టాఫీసు పథకం మీకు ఉపయోగపడుతుంది. దీని పేరు పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా ((Post Office Recurring Deposit Account). ఈ పథకంలో, RD మీద 5.8 శాతం వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ రేటు త్రైమాసికానికి అందుబాటులో ఉంటుంది. మీరు ఈ పథకంలో ప్రతి నెలా కనీసం రూ. 100 లేదా రూ. 10 గుణిజాల్లో ఉండే (110, 120..) మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్

పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate) పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో అందుబాటులో ఉంది. ఇది 5 సంవత్సరాల కాలానికి 7% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందించే పథకం. ఈ పథకం కింద, మీరు కనీసం రూ. 1000 లేదా రూ. 100 గుణిజాల్లో ఉండే (200, 300..) మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. ఈ పథకంలో, 5 సంవత్సరాల కాల గడువు పూర్తయిన తర్వాత మాత్రమే మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, కొన్ని షరతులకు లోబడి మీ పెట్టుబడిని ముందుగానే ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు తీసుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ (Post Office) టైమ్ డిపాజిట్ ఖాతా

పేరుకు తగ్గట్లుగానే, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (Post Office Time Deposit Account) ఒక రకమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ పథకం కింద, మీ డబ్బును 1, 2, 3 లేదా 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసులో డిపాజిట్ చేయవచ్చు. ఒకటి, రెండు, మూడు సంవత్సరాల FDలపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఇంకా మంచి రాబడి కోసం చూస్తున్నట్లయితే, 5 సంవత్సరాల వరకు టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టాలి. 5 సంవత్సరాల్లో 7% అత్యధిక వడ్డీ రేటు పొందుతారు. అలాగే, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ పథకం కింద, కనీసం రూ. 1000తో ఖాతా తెరవాలి. ఇందులోనూ గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు, మీకు ఇష్టమైనంత ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు.

Also Read:  Clay Pot: మట్టికుండలో నీరు తాగడం వల్ల మన శరీరానికి కలిగే 5 లాభాలు