Vitamins : ప్రతీ ఒక్కరూ జీవితం సంతోషంగా గడపాలనుకుంటారు. కానీ సంతోషానికి పునాది ఆరోగ్యం. ఆరోగ్యంగా లేకపోతే జీవితంలోని చిన్న చిన్న విషయాలకైనా ఆనందపడలేం. బలహీనత, అలసట, మానసిక ఉద్వేగాలు ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం శరీరానికి అవసరమైన పోషకాలు సరిపడకపోవడమే. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పలు రకాల విటమిన్లు అవసరం. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి, హార్మోన్ల సమతుల్యతను నిలబెడతాయి, కణాల మరమ్మత్తుకు తోడ్పడతాయి. అంతేకాదు, శక్తి ఉత్పత్తిలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ప్రతి రోజూ మనం ఎంత మోతాదులో విటమిన్లు తీసుకోవాలి? దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టమైన మార్గదర్శకాలు అందించింది.
విటమిన్ల అవసరాలు – WHO చెప్పినదేంటంటే:
1. విటమిన్ D
పెద్దవారికి రోజుకు 10 మైక్రోగ్రాములు విటమిన్ D అవసరం. ఇది ఎముకల బలానికి, రోగనిరోధక వ్యవస్థకు కీలకం. సహజంగా ఇది సూర్యకాంతిలోనూ, కొన్ని ఆహారాల్లోనూ లభిస్తుంది.
2. విటమిన్ A
మహిళలకు రోజుకు కనీసం 600 మైక్రోగ్రాములు, పురుషులకు 700 మైక్రోగ్రాములు అవసరం. ఇది చూపు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
3. విటమిన్ E
యాంటీఆక్సిడెంటుగా పనిచేసే ఈ విటమిన్‌ను రోజుకు 10 మిల్లీగ్రాములు తీసుకోవాలి. ఇది కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
4. విటమిన్ K
మహిళలకు 90 మైక్రోగ్రాములు, పురుషులకు 120 మైక్రోగ్రాములు అవసరం. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సహాయపడుతుంది.
5. విటమిన్ B గ్రూప్ (B2, B6)
విటమిన్ B6: రోజుకు 1.6 నుంచి 1.8 మిల్లీగ్రాములు. విటమిన్ B2 (రైబోఫ్లేవిన్): 1.6 నుంచి 2.0 మిల్లీగ్రాములు
ఈ విటమిన్లు శరీరంలో మెటబాలిజాన్ని మెరుగుపరచడంతో పాటు నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేయించడంలో సహాయపడతాయి.
విటమిన్లు ఎక్కువైనా ప్రమాదమే!
WHO ప్రకారం కొవ్వులో కరిగే విటమిన్లు – A, D, E, K వంటివి అధికంగా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయి విషప్రభావం కలిగించవచ్చు. కాబట్టి వీటిని డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. విటమిన్ల కోసం ఆహార మార్గం ఎంచుకోండి. సప్లిమెంట్లపై ఆధారపడకుండా సహజమైన ఆహారంతోనే విటమిన్ల అవసరాన్ని తీర్చవచ్చు. దానికోసం ఈ క్రింది పదార్థాలను తరచూ తీసుకోవాలి
. ఆకుకూరలు (పాలకూర, తోటకూర)
. పండ్లు (సీతాఫలం, మామిడిపండు, కివీ)
. పప్పులు, గింజలు
. తృణధాన్యాలు (ఒట్స్, బ్రౌన్ రైస్)
. పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు, చీజ్)
వయస్సు అనుసరించి మోతాదు మారుతుంది
విటమిన్ల అవసరం ప్రతి ఒక్కరికీ వయస్సు, లైఫ్స్టైల్, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా మారుతుంది. చిన్న పిల్లలు, గర్భిణీ మహిళలు, వృద్ధులు – వీరికి ప్రత్యేక ఆహార పద్ధతులు అవసరం. కాబట్టి ఒకసారి వైద్య నిపుణులను సంప్రదించి మీకు అవసరమైన మోతాదును తెలుసుకోవడం ఉత్తమం. విటమిన్లు తగిన మోతాదులో అందితేనే ఆరోగ్యం నిలుస్తుంది. అలాగే మితమైతే విషంలా మారుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన ఆహారం, విటమిన్ల పరిమిత మోతాదు, నిత్యం వ్యాయామం ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి. అప్పుడే మన జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడుస్తుంది.