. గుడ్లు పూర్తిగా సురక్షితమే: FSSAI స్పష్టం
. గుడ్ల పోషక విలువలు ఎంతో ముఖ్యమైనవి
. నిపుణుల మాట..పుకార్లకు భయపడొద్దు
Eggs : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆహార పదార్థాలపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఆధారాలు లేని అంశాలను అతిశయోక్తిగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రోజూ మనం తీసుకునే ఆహారాలపై భయాన్ని కలిగించేలా కంటెంట్ తయారు చేస్తున్నారు. ఇదే కోవలో ఇటీవల గుడ్ల గురించి కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని బ్రాండ్ల గుడ్లలో క్యాన్సర్‌కు కారణమయ్యే నిషేధిత యాంటీబయాటిక్ అయిన నైట్రోఫ్యూరాన్ ఆనవాళ్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) స్పష్టత ఇచ్చింది.
దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే గుడ్లు తినడానికి పూర్తిగా సురక్షితమని FSSAI తేల్చి చెప్పింది. గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని స్పష్టంగా పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించేవని, వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది. FSSAI మార్గదర్శకాల ప్రకారం పౌల్ట్రీ రంగంలో నైట్రోఫ్యూరాన్ వంటి యాంటీబయాటిక్స్ వాడకం చాలా ఏళ్ల క్రితమే నిషేధించారు. అరుదైన సందర్భాల్లో అత్యంత స్వల్ప ఆనవాళ్లు బయటపడినా, అవి అన్ని గుడ్లకు వర్తించవని సంస్థ తెలిపింది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఇంత తక్కువ మోతాదు వల్ల క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.
గుడ్లు అనేవి పోషకాల గనిగా పరిగణించబడతాయి. ఇందులో అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు విటమిన్ A, B12, D, E వంటి కీలక విటమిన్లు ఉంటాయి. అలాగే ఐరన్, జింక్, సెలీనియం, కోలిన్ వంటి మినరల్స్ శరీరానికి ఎంతో అవసరం. గుడ్లు కండరాల బలానికి సహాయపడతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడతాయి. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం చాలా మంది ఆరోగ్యవంతులకు ప్రయోజనకరంగా ఉంటుందని పోషక నిపుణులు చెబుతున్నారు. పుకార్లకు భయపడొద్దు సీనియర్ డైటీషియన్ మాట్లాడుతూ గుడ్డు సంపూర్ణ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలమని తెలిపారు. ఇది కండరాల నిర్మాణానికి, మెదడు అభివృద్ధికి, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. FSSAI నివేదికతో గుడ్లపై వస్తున్న పుకార్లు పూర్తిగా తప్పని తేలిపోయిందన్నారు. రోజూ గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని స్పష్టం చేశారు. గుడ్లలో ఉండే కోలిన్ మెదడు పనితీరుకు, కాలేయ ఆరోగ్యానికి అత్యంత అవసరమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు గుడ్లు చాలా ప్రయోజనకరమని తెలిపారు. ఆధారాలు లేని సోషల్ మీడియా ప్రచారాలను నమ్మి భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని నిపుణులు సూచిస్తున్నారు.
