Chakkera Pongali Recipe : చక్కెరపొంగలి ఇలా చేస్తే.. అస్సలు వదలరు

ఒక గిన్నెలో బెల్లం, పంచదార వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి వేడిచేయాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకూ ఉడికించి ..

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 10:14 PM IST

Chakkera Pongali Recipe : గుడిలో అయినా, ఇంట్లో అయినా మనం దేవుడిని పూజించి నైవేద్యంగా సమర్పించే వాటిలో చక్కెర పొంగలి (Chakkera Pongali Recipe) ఒకటి. ఇంట్లో కంటే.. దీనిని ఎక్కువగా గుడులలోనే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. చక్కెరపొంగలిని నైవేద్యంగానే కాకుండా.. స్వీట్ ఇష్టపడేవారు ఇంట్లో కూడా ట్రై చేస్తుంటారు. కానీ.. ఎంత బాగా చేసిన గుడిలో ప్రసారం టేస్ట్ రాదు. ఏదో తగ్గింది.. ఆ టేస్ట్ ఇందులో లేదు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పే పద్ధతిలో చక్కెర పొంగలిని తయారు చేస్తే.. అచ్చం గుడిలో ప్రసాదం లాగే ఉంటుంది. తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

చక్కెర పొంగలి తయారీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు -1/4 కప్పు
బియ్యం – ముప్పావు కప్పు
నీళ్లు – 2 కప్పులు
నెయ్యి – 1 టీ స్పూన్
బెల్లం తురుము – 1/2 కప్పు
పంచదార – 1.1/4 ముప్పు
ఎండుకొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – కొద్దిగా
ఎండు ద్రాక్ష – కొద్దిగా
యాలకులపొడి – 1/2 టీ స్పూన్
పచ్చకర్పూరం – చిటికెడు

చక్కెర పొంగలి తయారీ విధానం

ముందు ప్రెషర్ కుక్కర్ లో పైన తెలిపిన క్వాంటిటీలో పెసరపప్పు వేసి కొద్దిగా రంగు మారేంత వరకూ వేయించాలి. తర్వాత బియ్యం వేసి మళ్లీ వేయించుకోవాలి. బియ్యాన్ని కూడా వేయించాక నీళ్లుపోసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టాలి. ఈ బియ్యాన్ని మధ్యస్థ మంటపై ఉంచి 3విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం, పంచదార వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి వేడిచేయాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకూ ఉడికించి స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం నీటిని వడగట్టి ముందుగా ఉడకబెట్టి పక్కనపెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. దీనిని స్టవ్ పై ఉంచి నీరంతా పోయేంత వరకూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి.

మరో స్టవ్ పై కళాయి పెట్టి.. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యివేసి వేడిచేసుకోవాలి. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. పొంగలి నీరు లేకుండా ఉడికిన తర్వాత యాలకుల పొడి, పచ్చకర్పూరం వేయించిన డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) వేసి కలుపుకుని స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి తయారవుతుంది. ఇలా మీరు కూడా చక్కెరపొంగలి తయారు చేస్తే.. ఒక్కస్పూన్ కూడా వదలకుండా ఎంతో ఇష్టంగా తింటారు.

Also Read : Coriander : కొత్తిమీర తినడం వలన కలిగే అనేక ప్రయోజనాలు..