Site icon HashtagU Telugu

PM Modi : ‘‘భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లు మీరే’’.. ఎన్నారైల సమావేశంలో ప్రధాని మోడీ

Pm Modi Indians Brand Ambassadors

PM Modi : సప్త సముద్రాలు దాటి వెళ్లినా.. భారత్‌తో ప్రవాస భారతీయుల బంధంగా బలంగానే ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంపై ప్రవాస భారతీయులకు ఉన్న ప్రేమ, మమకారం అలాంటిదని ఆయన కొనియాడారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. ప్రవాస భారతీయుల మనసంతా వారి దేశంలోనే ఉంటుందన్నారు. న్యూయార్క్‌ రాష్ట్రంలోని లాంగ్ ఐలాండ్‌లో ఉన్న నాసావు కొలీజియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దాదాపు పదివేల మంది భారతీయ-అమెరికన్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.  అమెరికాలో భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లు ప్రవాస  భారతీయులే అని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రవాస భారతీయులకు అమెరికాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి పనితీరు, క్రమశిక్షణ, అంకిత భావం, పట్టుదల అనన్య సామాన్యం. ఈ లక్షణాలే వారిని అందరి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి’’ అని మోడీ వ్యాఖ్యానించారు.

Also Read :PM Modi : 15 టెక్ కంపెనీల సీఈవోలతో మోడీ భేటీ.. ‘మేడ్‌ బై ఇండియా’ గురించి చర్చ

‘‘గతంలో నేను అమెరికాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి చాలాసార్లు ప్రసంగించాను. 2014లో మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో, 2016లో కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో,  2018లో హ్యూస్టన్, టెక్సాస్‌‌లలో, 2023లో వాషింగ్టన్‌లో ప్రసంగించాను. ఇప్పుడు లాంగ్ ఐలాండ్‌లో మీ ముందున్నాను. అమెరికా, భారత్‌ల మధ్య వారధిలా నిలుస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు’’ అని ప్రధాని మోడీ తెలిపారు. ‘నమస్తే’  అనే భారతీయ పదం లోకల్‌ నుంచి గ్లోబల్‌ స్థాయికి ఎదగడంలో ప్రవాస భారతీయులే కీలక పాత్ర పోషించారని కితాబిచ్చారు.ప్రపంచ పౌరులుగా భారతీయులు రాణిస్తున్న తీరు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. భారతదేశం ‘విశ్వ బంధు’ అని యావత్ ప్రపంచం గ్రహించిందన్నారు. ‘‘భారతీయులు భూమిపై ఎక్కడున్నా భారతీయ విలువలు, సంస్కృతి అనేవి వారిని ఏకం చేస్తుంటాయి’’ అని మోడీ(PM Modi) పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భారతీయతను అద్దంపట్టే పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

Also Read :Diabetes : రాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువ, వైద్యులు ఏమంటున్నారు?