Womens Reservation Bill : ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు. ‘నారీ శక్తి వందన్ యాక్ట్’ పేరుతో ఈ బిల్‌ని కేంద్ర సర్కారు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో పాస్ అయింది. అనంతరం రాష్ట్రపతికి పంపగా.. దీన్ని పరిశీలించిన ద్రౌపది ముర్ము అప్రూవ్ చేశారు. కేంద్రం దీనిపై శుక్రవారం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో 33% మేర మహిళలకే సీట్లను కేటాయిస్తారు. అయితే ఇది ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేవు. పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే కనీసం ఐదారేళ్లు పడుతుందని అంచనా.జనగణన అనంతరం నిర్వహించే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతే మహిళా బిల్లు అమల్లోకి రానుంది.
Government of India issues a gazette notification for the Women's Reservation Bill after it received the assent of President Droupadi Murmu. pic.twitter.com/GvDI2lGF1C
— ANI (@ANI) September 29, 2023
Also read : BJP Internal Fight : మోడీతో తాడోపేడో! బీజేపీ అసమ్మతి వ్యూహం!!
మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని 239ఏఏ, 330, 332, 334 అధికరణలకు సవరణలు చేయనున్నారు. ఆర్టికల్ 239ఏఏ క్లాజ్ (2), సబ్‌క్లాజ్ (బి)కింద కొత్తగా బీఏ, బీబీ, బీసీ క్లాజులను చేర్చారు. ఆర్టికల్ 330 కింద కొత్తగా 330ఏ(1)(2)(3)ని చేర్చారు. ఆర్టికల్ 332 కింద 332ఏ (1)(2)(3)క్లాజ్‌లు చేర్చి ఢిల్లీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, వాటి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించనున్నారు. ఆర్టికల్ 334లో కొత్తగా 334ఏ(1) చేర్చి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లన్నీ ఈ చట్టంతో (Womens Reservation Bill) అమల్లోకి వస్తాయి.