Indias Best Friends: భారత సైన్యం వీరోచితంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చింది. పాకిస్తాన్ మిత్రదేశాలు ఏవో తెలిసిపోయింది. చైనా, తుర్కియే (టర్కీ)లు పాకిస్తాన్‌కు ఆయుధాలను అందిస్తున్న తీరు మరోసారి బయటపడింది. ఇక భారత్‌కు బలమైన మద్దతునిచ్చే మిత్రదేశాలు ఏవో తెలిసిపోయింది. ప్రత్యేకించి నాలుగు దేశాలు భారత్‌తో స్ట్రాంగ్‌గా నిలబడ్డాయి. ఏ సాయమైన అందించడానికి సిద్ధపడ్డాయి. అవే.. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్.
Also Read :Virat Kohli Diet : విరాట్ కోహ్లీ డైట్ ప్లాన్.. ఏం తింటాడు ? ఏం తినడు ?
రష్యా
రష్యా.. భారత్‌కు నమ్మకమైన మిత్రదేశం. గతంలోనూ మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న ఘన చరిత్ర రష్యాకు ఉంది. మన దేశం మేడిన్ ఇండియా ఆయుధాలను తయారు చేసే లెవల్‌కు ఎదిగిందంటే అందుకు కారణం రష్యాయే(Indias Best Friends). తన ఆయుధ తయారీ టెక్నాలజీని రష్యా ఏ మాత్రం ఆలోచించకుండా భారత్‌కు అందిస్తుంటుంది. రష్యా, భారత్‌ల స్నేహాన్ని చూసి అమెరికాకు నిత్యం ఎన్నో సందేహాలు వస్తుంటాయి. భారత్ ఎవరి పక్షాన ఉందో తేల్చుకోలేక అమెరికా తల గోక్కుంటూ ఉంటుంది. చైనాకు విరుగుడుగా భారత్‌ను తయారు చేసే కసితోనే.. భారత్‌కు ఆయుధాలను అమెరికా విక్రయిస్తుంటుంది. రష్యా మాత్రం తన మిత్రదేశం హోదాలో భారత్‌కు ఆయుధాలను విక్రయిస్తుంటుంది. అమెరికా, రష్యాలకు ఉన్న ప్రధాన తేడా ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా అవకాశ వాద దేశం. ఇటీవలే పాక్‌తో జరిగిన యుద్ధంలో రష్యాకు చెందిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లు, యుద్ద విమానాలకు చుక్కలు చూపించాయి. భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాయి.
ఇజ్రాయెల్
భారత్ అత్యంత విశ్వసించే మిత్ర దేశం ఇజ్రాయెల్. ఈసారి పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలు మొదలుకాగానే ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. అవసరమైతే భారత్‌కు సైనిక సాయం చేయడానికి తాము రెడీ అని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దేశం నుంచి ఎన్నో అధునాతన ఆయుధాలను భారత్ కొనుగోలు చేసింది. ఇటీవలే పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఈసారి భారత్ వినియోగించిన సూసైడ్ డ్రోన్ ‘హార్పీ’ ఇజ్రాయెల్‌లోనే తయారైంది. ఇజ్రాయెల్ సహకారంతోనే భారత్‌కు చెందిన డీఆర్‌డీఓ డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. డీ4 యాంటీ డ్రోన్ వ్యవస్థ.. శత్రువుల డ్రోన్లను వెంటనే గుర్తించి నిర్వీర్యం చేసి, కాల్చేసి కూల్చేయగలదు. భారత సైన్యం అమ్ములపొదిలో ఎన్నో ఇజ్రాయెల్ తయారీ మిస్సైళ్లు కూడా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అవసరాల కోసం ఇజ్రాయెల్ సైన్యం సహకారాన్ని భారత సైన్యం తీసుకుంటుంది. స్పై డ్రోన్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు, మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ల విషయంలో ఇజ్రాయెల్ సహకారాన్ని భారత్ తీసుకుంటుంది.
ఫ్రాన్స్
భారత్‌కు నమ్మకమైన మరో మిత్ర దేశం ఫ్రాన్స్. భారత్ వద్దనున్న అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశానివే. ఒకవేళ పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగి ఉంటే తప్పకుండా ఫ్రాన్స్ నుంచి భారత్‌కు ఆయుధాలు సప్లై అయి ఉండేవి. ఈమేరకు ఇరుదేశాల మధ్య ఇప్పటికే వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఇటీవలే ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత్ వాడిన ‘స్కాల్ప్’ మిస్సైళ్లు ఫ్రాన్స్‌లో తయారైనవే. అంతరిక్షం, అణుశక్తి, సైనిక అంశాల్లో భారత్, ఫ్రాన్స్‌లు కలిసికట్టుగా చాలా ప్రాజెక్టుల్లో భాగమయ్యాయి. విమాన వాహక యుద్ద నౌకలు, అత్యాధునిక అణు జలాంతర్గాముల తయారీ సాంకేతికతను భారత్‌కు ఇస్తామని ఇప్పటికే ఫ్రాన్స్ ప్రకటించింది. కశ్మీర్ అంశంలో ఎలాంటి సంకోచం లేకుండా భారత్‌కు మద్దతు ఇచ్చే దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి.
జపాన్
జపాన్ పెద్దగా సౌండ్ చేయకపోయినా.. సైలెంటుగా భారత్‌కు అండగా నిలిచే మిత్రదేశం. అందుకే జపాన్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాఫ్ట్ బ్యాంక్ అనేది జపనీస్ బ్యాంకు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి దిగ్గజ కంపెనీలకు భారీగా అప్పులు ఇచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌కు తొలి బుల్లెట్ ట్రైన్‌ను అందించేందుకు వందల కోట్ల రూపాయలను జపాన్ ఖర్చు పెడుతోంది. భారత్‌లోని ఎన్నో నిర్మాణ రంగ ప్రాజెక్టులకు జపాన్ ప్రభుత్వం ఫైనాన్సింగ్ సాయాన్ని అందించింది. భారత్‌తో స్నేహాన్ని కోరుకోబట్టే జపాన్ ఇదంతా చేస్తోంది.