Congress Leader: అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు, డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి పృథ్వీరాజ్ చవాన్ వింతైన, ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలో అమెరికా జరిపిన సైనిక చర్యను ప్రస్తావిస్తూ ఆయన భారత్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఏమిటా వింత వ్యాఖ్యలు?
వెనిజులా రాజధాని కారకాస్‌పై అమెరికా సైనికులు దాడి చేసి, అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించిన విషయాన్ని చవాన్ గుర్తు చేశారు. దీనిపై స్పందిస్తూ.. అమెరికా ఇప్పటికే భారత్‌తో వాణిజ్యాన్ని దాదాపు నిలిపివేసింది. ఇప్పుడు వెనిజులాలో చేసినట్లుగా భారత్‌లో కూడా ట్రంప్ ఏదైనా చేస్తారా? ఏమిటి, మన ప్రధానిని కూడా ట్రంప్ సాబ్ ఎత్తుకుపోతారా (కిడ్నాప్ చేస్తారా)? ఇప్పుడు ఇక అది ఒక్కటే మిగిలి ఉంది అని చవాన్ వ్యాఖ్యానించారు.
Also Read: టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-బంగ్లాదేశ్ వివాదంపై ఐసీసీ జోక్యం!
టారిఫ్‌ల ప్రభావంపై విశ్లేషణ
భారతదేశంపై అమెరికా విధించిన టారిఫ్‌ల (సుంకాలు) గురించి చవాన్ ఇలా అన్నారు. 50 శాతం టారిఫ్ విధించిన తర్వాత వాణిజ్యం కొనసాగించడం సాధ్యం కాదు. ఇది నేరుగా నిషేధం విధించకుండా టారిఫ్‌ను ఒక ఆయుధంగా వాడుకుని భారత్ నుండి అమెరికాకు జరిగే ఎగుమతులను అడ్డుకోవడమే. అమెరికాకు ఎగుమతులు చేయడం ద్వారా మన దేశ ప్రజలకు వచ్చే లాభాలు ఇక ఉండవు. మనం ఇప్పుడు ఇతర దేశాల మార్కెట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ వ్యాఖ్యల వెనుక డొనాల్డ్ ట్రంప్ జనవరి 5న చేసిన ప్రకటన ఉంది. రష్యా నుండి చమురు కొనుగోలును భారత్ నిలిపివేయకపోతే భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. పీఎం మోదీ మంచి వ్యక్తి అని, ఆయన నన్ను సంతోషపెట్టాలని అనుకుంటున్నారని ట్రంప్ అన్నారు. నేను అసంతృప్తిగా ఉన్నానని మోదీకి తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పృథ్వీరాజ్ చవాన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడి విషయంలో అమెరికా వ్యవహరించిన తీరును భారత ప్రధానితో పోల్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
