Sanjay Raut: కేంద్ర ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతుందా? లేదా అనే విషయంపై తనకు సందేహం ఉన్నట్టు తెలిపారు. 2026 తర్వాత కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా? అనే ప్రశ్న నా మనసులో ఉంది. ప్రధాని మోడీ తన పదవీకాలాన్ని పూర్తిచేయలేకపోవచ్చు. కేంద్రంలో అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం మహారాష్ట్రలో కూడా కనిపిస్తుంది.. అని సంజయ్ రౌత్ అన్నారు.
శివసేన (యూబీటీ) పార్టీకి చెందిన రాజన్ సాల్వీ ఆ పార్టీని వీడతారనే ఊహాగానాల నేపథ్యంలో, దర్యాప్తు సంస్థల అరెస్టుల భయంతో చాలా మంది పార్టీని విడిచిపెడుతున్నారని సంజయ్ రౌత్ విమర్శించారు. ఇంకా..దర్యాప్తు సంస్థలు లేదా కేంద్ర ఒత్తిళ్లకు భయపడని వ్యక్తులతో పార్టీని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
అంతేకాక.. సంజయ్ రౌత్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రధాని మోడీ లేదా కేంద్రమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఏక్‌నాథ్ షిండే తన సొంత పార్టీపైనే నియంత్రణ కలిగించలేకపోతున్నారు. కానీ, బాలాసాహెబ్ సిద్ధాంతాలతో నడుస్తున్న మా శివసేన (యూబీటీ) విధానాలు అలాంటి వాటికి విరుద్ధంగా ఉంటాయి. మేము ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు అని సంజయ్ రౌత్ స్పష్టంచేశారు.
Read Also: Pawars Reunion : ఏకం కానున్న ఇద్దరు పవార్లు ? అజిత్ పవార్ తల్లి కీలక వ్యాఖ్యలు