Site icon HashtagU Telugu

Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..

Why the eight-year delay? ..Chidambaram's response on the Centre's reduction in GST rates..

Why the eight-year delay? ..Chidambaram's response on the Centre's reduction in GST rates..

Chidambaram : కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపు నిర్ణయం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. కేంద్రంలోని ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్వాగతించినప్పటికీ, దీన్ని ఎనిమిదేళ్ల ఆలస్యంగా వచ్చిన నిర్ణయంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చిదంబరం మాట్లాడుతూ..ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం. కానీ ప్రభుత్వం ఆ సూచనలను పట్టించుకోలేదు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమలులోకి తీసుకువచ్చిన జీఎస్టీ సవరణలు తొలినాళ్ల నుంచే అమలు చేసి ఉంటే, వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు తక్కువ భారం ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత హఠాత్తుగా ఈ మార్పులు చేయడం వెనుక అసలు కారణం ఏమిటన్నదే మా ప్రశ్న అని అన్నారు.

జీఎస్టీ మార్పుల వెనుక రాజకీయ కారణాలా?

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక, రాజకీయ కోణాల్లో విశ్లేషిస్తూ, చిదంబరం అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని, పెరుగుతున్న కుటుంబ అప్పులను, తగ్గుతున్న పొదుపును గమనిస్తే ఈ మార్పులు ఆ ఆర్థిక ఒత్తిడులే కారణమా అనే అనుమానం కలుగుతుంది. అదేనేగానీ, త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం కూడా ఈ నిర్ణయానికి ఉండకపోవచ్చా? అంటూ ప్రశ్నించారు. అంతేకాక, గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న మార్పులు, అమెరికా నుంచి వచ్చే వాణిజ్య ఒత్తిళ్ల నేపథ్యంలో భారత ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని సవరించడం, వ్యాపార వర్గాలకు మార్పులు చేర్పులు చేయడం తప్పని సరిగా మారిందని అభిప్రాయపడ్డారు.

మోడీ ప్రతిస్పందన..ఇది తర్వాతి తరం సంస్కరణ

కాగా, ఈ జీఎస్టీ మార్పులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన మాట్లాడుతూ..ఇవి తర్వాతి తరం సంస్కరణలు. ఈ నిర్ణయాలు రైతులకు, మధ్యతరగతి ప్రజలకు, ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూర్చేలా తీసుకున్నవి. సామాన్యుడి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం మా లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రధాని ప్రకారం, ఈ మార్పుల ద్వారా వినియోగదారులకు ధరల భారం తక్కువ అవుతుంది. ఇకపోతే చిన్న వ్యాపారాలపై ఉన్న పన్ను ఒత్తిడి తగ్గి, వారు మరింత స్థిరంగా వ్యాపారాన్ని కొనసాగించగలరని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇక, జీఎస్టీ మార్పుల పట్ల ప్రజా అభిప్రాయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమైన విషయం. ఒకవైపు ఇది వాస్తవిక అవసరాల నిమిత్తంగా తీసుకున్న ఆర్థిక సంస్కరణగా భావించవచ్చు.  మరోవైపు, రాజకీయ లబ్ధి కోణంలోనూ దీన్ని చూడవచ్చు. అయినప్పటికీ, ఎనిమిదేళ్ల తరువాత వచ్చిన ఈ మార్పులు దేశ ఆర్థిక పరిస్థితిపై ఎంత ప్రభావం చూపుతాయన్నది కాలమే తేల్చాలి.

Read Also: Northern Turkey : జలప్రవేశం చేసిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక: తుర్కియేలో ఉద్రిక్తత