Lawrence Bishnoi : అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య వ్యవహారం యావత్ దేశంలో కలకలం రేపింది. ముంబైలో జరిగిన ఈ ఉదంతంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిఖీపై తుపాకులతో కాల్పులు జరిపిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారిని విచారించగా తాము గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి సుపారీ తీసుకున్నామని వెల్లడించారు. దీంతో ఇప్పుడు అందరి చూపు లారెన్స్ బిష్ణోయ్ వైపు మళ్లింది. ప్రస్తుతం అతగాడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. లారెన్స్ బిష్ణోయ్‌ను(Lawrence Bishnoi) ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటంటే..
Also Read :Assassination Attempt : ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం.. దుండగుడు ఏం చేశాడంటే..?
ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటిపై లారెన్స్ బిష్ణోయ్ మనుషులు కాల్పులు జరిపిన ఘటనతో అంతటా ఆందోళన వ్యక్తమైంది. ఆ టైంలోనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమకు లారెన్స్ బిష్ణోయ్‌ను కస్టడీకి అప్పగించాలని పలు దరఖాస్తులు చేశారు. అయితే అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలు నుంచి బిష్ణోయ్‌ను తరలించడాన్ని నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 268 (1) ప్రకారం ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశంలో శాంతిభద్రతలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న హై ప్రొఫైల్ ఖైదీల కదలికలను, బదిలీని నిరోధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 268 (1) ప్రత్యేకత. లారెన్స్ బిష్ణోయ్‌ను సబర్మతీ జైలు నుంచి ఎక్కడికీ తరలించరాదంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వు గడువు ఈ ఏడాది ఆగస్టుతోనే ముగిసింది. ఇటీవలే ఆ తేదీని పొడిగించారు. అందుకే లారెన్స్ బిష్ణోయ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలనే ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు.