DNA Report : వైద్యురాలిపై అఘాయిత్యం కేసు.. కీలకంగా డీఎన్ఏ రిపోర్టు

జూనియర్ వైద్యురాలిపై లైంగికదాడి చేసింది ఒకరా ? ఒకరి కంటే ఎక్కువ మందా ? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Published By: HashtagU Telugu Desk
Kolkata Doctor Murder Case Dna Report

DNA Report : బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతం గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు ఈ కేసుతో ముడిపడిన అన్ని విషయాలను వెలుగులోకి తెస్తోంది. తాజాగా ఇవాళ సీబీఐ టీమ్ తాము రూపొందించిన దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. మరోవైపు జూనియర్ వైద్యురాలిపై లైంగికదాడి చేసింది ఒకరా ? ఒకరి కంటే ఎక్కువ మందా ? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. సదరు జూనియర్ వైద్యురాలిపై సామూహిక హత్యాచారం జరగలేదని సీబీఐ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మాత్రం డీఎన్ఏ రిపోర్ట్(DNA Report) వచ్చే వరకు వేచిచూడాలి. శాంపిల్స్‌కు ప్రస్తుతం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్  లేబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్)‌లో టెస్టులు జరుగుతున్నాయి. త్వరలోనే నివేదిక రానుంది. ఈ నివేదిక వచ్చే వరకు ఎలాంటి ప్రచారం జరిగినా నమ్మొద్దని బెంగాల్ పోలీసులు ప్రజలను కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించిన తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఆగస్టు 9న తెల్లవారుజామున ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాలులో జూనియర్ వైద్యురాలిపై  నిందితుడు సంజయ్ రాయ్ హత్యాచారం జరిపాడు. అంతకంటే ఒక రోజు ముందు (ఆగస్టు 8న) ఉదయం 11 గంటల టైంలో నిందితుడు ఆస్పత్రి వార్డులోనే తిరిగాడు. అతడు జూనియర్ వైద్యురాలి వైపే చూస్తున్నట్లుగా ఆ సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డయింది. సీబీఐ దర్యాప్తులో ఈవిషయాన్ని సంజయ్ రాయ్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆగస్టు 8న జూనియర్ వైద్యురాలితో కలిసి ఆస్పత్రిలో డ్యూటీ చేసిన మిగతా నలుగురు జూనియర్ వైద్యుల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ అధికారులు రికార్డు చేశారు.

Also Read :Cristiano Ronaldo : రొనాల్డోకు ‘గోల్డెన్ ప్లే’ బటన్.. 12 గంటల్లోనే 1.30 కోట్ల సబ్‌స్క్రయిబర్లు

సీబీఐ అధికారులు ఇంటరాగేట్ చేసే సమయంలో కూడా నిందితుడు సంజయ్ రాయ్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని సమాచారం. గతంలో కూడా పలుమార్లు జూనియర్ వైద్యురాలితో అతడు అనుచితంగా ప్రవర్తించాడని గుర్తించారు. సంజయ్ రాయ్ మూడు నెలల గర్భిణి అయిన తన భార్యను కొట్టడం వల్ల ఆమెకు గర్భస్రావం జరిగిందని విచారణలో తేలింది.

  Last Updated: 22 Aug 2024, 04:43 PM IST