President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఉన్న ఈ మ‌హిళ ఎవ‌రో తెలుసా?

వారణాసికి చెందిన శివాంగి సింగ్ 2017లో ఐఏఎఫ్‌లో చేరారు. ఆమె 2020లో రఫేల్ ఫైటర్ జెట్ పైలట్‌గా ఎంపికై, అంబాలాలోని ప్రసిద్ధ “గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్”లో భాగమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన వైమానిక దాడుల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.

Published By: HashtagU Telugu Desk
President Murmu

President Murmu

President Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి కొత్త చరిత్ర సృష్టించారు. హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ నుండి రఫేల్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. ఈ చారిత్రక ఘట్టం కేవలం అధికారిక ప్రయాణం మాత్రమే కాకుండా స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ పట్ల పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారానికి గట్టి జవాబుగా నిలిచింది.

శివాంగి సింగ్‌కు గౌరవం

రాష్ట్రపతి ముర్ము రఫేల్ విమానం ముందు ఫోటో దిగిన అధికారి మరెవరో కాదు దేశంలో మొదటి, ఏకైక మహిళా రఫేల్ ఫైటర్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత్ ఫైటర్ పైలట్‌ను బంధించారని, లేదా చంపేశారని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. అయితే సాక్షాత్తు దేశాధినేత శివాంగి సింగ్‌తో కలిసి కనిపించడం ద్వారా ఆ ప్రచారమంతా నిరాధారమైన అబద్ధమని తేలిపోయింది.

ఐఏఎఫ్ తరపున గట్టి జవాబు

భారత వైమానిక దళం (IAF) కూడా ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. 159వ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ కోర్సు (QFIC) ముగింపు వేడుకల్లో శివాంగి సింగ్‌కు ప్రతిష్టాత్మకమైన “క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ (QFI)” బ్యాడ్జ్ లభించిన విషయాన్ని వెల్లడిస్తూ తాజా చిత్రాలను, వీడియోలను విడుదల చేసింది. వైమానిక దళం ఇచ్చిన ఈ గౌరవం పాకిస్తాన్ చేస్తున్న ‘ప్రచార యుద్ధం’లో మహిళా గౌరవాన్ని కించపరచడాన్ని తిప్పికొట్టింది.

Also Read: Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?

స్క్వాడ్రన్ లీడర్ శివాంగి

వారణాసికి చెందిన శివాంగి సింగ్ 2017లో ఐఏఎఫ్‌లో చేరారు. ఆమె 2020లో రఫేల్ ఫైటర్ జెట్ పైలట్‌గా ఎంపికై, అంబాలాలోని ప్రసిద్ధ “గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్”లో భాగమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన వైమానిక దాడుల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. తన వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ, నిర్భయ వైఖరికి పేరుగాంచిన శివాంగి సింగ్.. నేటి యువ మహిళలకు ఆకాశమే హద్దు అని నిరూపించిన స్ఫూర్తిగా నిలిచారు.

రాష్ట్రపతి చారిత్రక ప్రయాణం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్‌లో ప్రయాణించడం దేశ వైమానిక శక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ విమానానికి గ్రూప్ కెప్టెన్ అమిత్ గహానీ (17 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్) సారథ్యం వహించారు. మొత్తం 30 నుండి 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయాణంలో రాష్ట్రపతి రఫేల్ అత్యాధునిక సామర్థ్యాలను ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ చారిత్రక ఘట్టం భారత వైమానిక దళం గొప్ప చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

  Last Updated: 29 Oct 2025, 04:11 PM IST