Jagdish Uikey : గత రెండు వారాల వ్యవధిలో మన దేశంలోని విమానయాన సంస్థలకు వందలాదిగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో కలకలం రేగింది. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ బాంబు బెదిరింపుల వెనుక ఉన్న ఒక వ్యక్తిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు గుర్తించారు. గోండియా నగరానికి చెందిన 35 ఏళ్ల జగదీశ్ ఉయికే అనే యువకుడు పలు బాంబు బెదిరింపు మెసేజ్‌లు పంపాడని గుర్తించారు. అతడు ఉగ్రవాదంతో ముడిపడిన అంశాలపై ఒక పుస్తకాన్ని కూడా రాశాడని విచారణలో తేలింది. 2021లోనూ ఓ కేసులో జగదీశ్‌ను(Jagdish Uikey) పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది. విమానయాన సంస్థలకు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన వ్యక్తి అతడే అని తేలినప్పటి నుంచి జగదీశ్ ఉయికే పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును స్వయంగా డీసీపీ శ్వేతా ఖేడ్కర్ పర్యవేక్షిస్తున్నారు. జగదీశ్‌ను అరెస్టు చేసేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
- ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్‌పీఎఫ్ పోలీసులకు అతడు గతంలో బెదిరింపు మెసేజ్‌లు పంపాడని విచారణలో వెల్లడైంది.
- ఉగ్రవాదుల నుంచి మన దేశానికి పొంచి ఉన్న ముప్పుపై ప్రధాని మోడీ ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని తనకు కల్పించాలని కోరుతూ జగదీశ్ ఉయికే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఈమెయిల్ పంపినట్లు గుర్తించారు.
- అక్టోబరు 21న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు జగదీశ్ ఉయికే బెదిరింపు ఈమెయిల్ పంపాడు. రైల్వే ట్రాక్‌లపై అలజడి జరగబోతోందని ఆ ఈమెయిల్స్‌లో ప్రస్తావించాడు. దీంతో అలర్ట్ అయిన రైల్వేశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.