Site icon HashtagU Telugu

NCW Chairperson : జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్‌

Vijaya Kishore Rahatkar National Commission For Women Chairperson

NCW Chairperson : జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌‌సీడబ్ల్యూ)  కొత్త ఛైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు శనివారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  జాతీయ మహిళా కమిషన్ చట్టం – 1990లోని సెక్షన్ 3 ప్రకారం రహత్కర్ మూడేళ్లపాటు లేదా ఆమె 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. విజయ కిషోర్ పదవీకాలం వెంటనే ప్రారంభం కానుంది. రహత్కర్ నియామకంతో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు కొత్త సభ్యులను కూడా కేంద్ర సర్కారు నియమించింది. డాక్టర్ అర్చన మజుందార్‌ను మూడేళ్ల కాలానికిగానూ కమిషన్ సభ్యురాలిగా నియమించారు. మహిళా,శిశు సంక్షేమ శాఖ దీనిపై ఓ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read :Kashmir Statehood : జమ్మూకశ్మీర్‌కు ‘రాష్ట్ర హోదా’పై లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం

విజయ కిషోర్ రహత్కర్‌ ఎవరు ? 

  • ఇప్పటివరకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ రాజస్థాన్ యూనిట్ కో ఇంఛార్జిగా విజయ కిషోర్ రహత్కర్‌ (NCW Chairperson) సేవలు అందించారు.
  • గత కొన్ని దశాబ్దాలుగా ఆమె బీజేపీలో అనేక కీలక పదవులను నిర్వహించారు.
  • విజయ రహత్కర్ ఫిజిక్స్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.
  • ఆమె పూణే యూనివర్సిటీ  నుంచి హిస్టరీలో పీజీ చేశారు.
  • విజయ రహత్కర్ స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా.
  • ఆమె 1995లో బూత్ వర్కర్‌గా బీజేపీలో చేరి, క్రమంగా పార్టీలో ముందుకు సాగారు.
  • విజయ రహత్కర్ 2000 నుంచి 2010 సంవత్సరం వరకు ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
  • 2007 నుంచి 2010 వరకు ఔరంగాబాద్ మేయర్‌గా విజయ రహత్కర్ సేవలు అందించారు.
  • వచ్చే నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్రానికి చెందిన విజయకు కీలక పదవిని బీజేపీ సర్కారు కేటాయించింది. తద్వారా మహారాష్ట్రలోని మహిళా ఓటు బ్యాంకును ఎన్నికల్లో తమ  వైపు తిప్పుకునేందుకు బీజేపీ పదునైన వ్యూహాన్ని అమలుపర్చింది.

Also Read :Vikash Yadav : ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్రకేసు.. ‘రా’ మాజీ అధికారి వికాస్ అరెస్టు !