Haryana New CM : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారం దక్కించుకుని నూతన ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లకుగానూ 48 సీట్లు సాధించిన బీజేపీ.. ఐఎన్ఎల్డీ, ఇతరులను కలుపుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Also: Congress : హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదు: కాంగ్రెస్
దీనిపై ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. అయితే ముఖ్యమంత్రి రేసులో పలువురు ఉన్నప్పటికీ ఇప్పటికే కాషాయదళం ఛాయిస్ క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైనీనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఇందులో మరో మాటకు తావులేదని బీజేపీ అధిష్టానం చెబుతున్నట్లు సమాచారం.
ఓబీసీ వర్గాలకు చెందిన సైనీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్లే తాము హ్యాట్రిక్ విజయం అందుకున్నట్లు భావిస్తున్న బీజేపీ.. ఆయనను సీఎంగా కొనసాగించడం ద్వారా ఆయా వర్గాలకు తాము అనుకూలమే అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలకు సరిగ్గా 200 రోజుల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్ధానంలో అధిష్టానం నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది.
దీనిపై అప్పట్లో పార్టీలో భిన్నస్వరాలు వినిపించాయి. ఖట్టర్ వర్గం కూడా సైనీని అప్పట్లో ఆమోదించలేదు. కానీ క్రమంగా అధిష్ఠానం మనసులో ఏముందో తెలుసుకున్న పార్టీ నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆ అస్త్రమే పనిచేసింది. త్వరలో శాసనసభాపక్ష భేటీ ఏర్పాటు చేసి సైనీకే మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.