Sadanand Date : ఆయన పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో కసబ్‌తో మొదటిగా తలపడింది ఆయనే. ఆనాడు ముంబై సెంట్రల్ ప్రాంతం అడిషనల్ పోలీసు కమిషనర్‌గా ఉన్న సదానంద్ దాతే, ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చీఫ్‌గా ఉన్నారు. ఉగ్రవాది తహవ్వుర్ రాణాను అప్పగించేలా భారత్ తరఫున బలమైన వాదనను అమెరికా కోర్టుల్లో ఈయన వినిపించారు. ఇప్పుడు రాణాను భారత్‌లో ఇంటరాగేట్ చేయనుంది కూడా సదానంద్ దాతేనే.
Also Read :Deputy PM : ఉప ప్రధానిగా నితీశ్ ? బాబూ జగ్జీవన్ రామ్ తరహాలో అవకాశం!
పేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి..
సదానంద్ దాతే(Sadanand Date) సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి వివిధ ఇళ్లలో పనిమనిషిగా ఉండేవారు. పేదరికం వల్ల సదానంద్ దాతే బాల్యంలో పేపర్ బాయ్‌గా పనిచేశారు. పట్టుదలతో చదువుకొని ఆయన ఐపీఎస్ అధికారి అయ్యారు. దాతే 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. పోలీసు శాఖలో అంచెలంచెలుగా ఎదిగి ఎన్ఐఏ చీఫ్ స్థాయికి చేరారు. ముంబై పోలీసు శాఖలో, సీబీఐలో, మహారాష్ట్ర ఏటీఎస్‌లో దాతే కీలక హోదాల్లో సేవలు అందించారు. మిరా-భయందర్-వసాయి-విరార్ ప్రాంతం తొలి పోలీస్ కమిషనర్ ఆయనే. ముంబై దాడుల సమయంలో దాతే చూపించిన తెగువకు గుర్తింపుగా ప్రెసిడెంట్ గాలంటరీ మెడల్‌ను ప్రదానం చేశారు. ఏడాది క్రితమే ఆయన ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
Also Read :Purandeswari: పురందేశ్వరికి కీలక పదవి.. బీజేపీ పెద్ద స్కెచ్
2008 నవంబరు 26న సదానంద్ దాతే పోరాటం ఇలా..
2008 నవంబరు 26న ముంబై నగరంపై ఉగ్రదాడి జరిగింది. అప్పట్లో ముంబై సెంట్రల్ అదనపు పోలీసు కమిషనర్‌గా సదానంద్ దాతే ఉండేవారు. ఉగ్రదాడి మొదలైందనే సమాచారం అందగానే దాతే .. ముంబై మలబార్ హిల్స్‌లోని తన నివాసం నుంచి హుటాహుటిన సీఎస్‌టీ స్టేషన్‌కు బయలుదేరారు. మధ్యలో ఒక పోలీస్ స్టేషన్ వద్ద ఆగి కార్బైన్‌తో సహా ఆయుధాలు తీసుకున్నారు. తన వెంట ఆరుగురు పోలీసు అధికారులతో బయలుదేరారు. సీఎస్‌టీ స్టేషన్‌ను చేరుకోగానే ఇద్దరు ఉగ్రవాదులు Cama, Albless ఆస్పత్రిలోకి చొరబడ్డారని దాతేకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే అక్కడికి వెళ్లారు. ఆస్పత్రిలోకి వెళ్లిన ఇద్దరు ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్తాయిల్ అని ఆ తర్వాత నిర్ధారణ అయింది. ఆసుపత్రి పైకప్పు (రూఫ్‌టాప్) నుంచి పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఆస్పత్రి పైకప్పు నుంచి ఉగ్రవాది కసబ్ విసిరిన గ్రనేడ్ దాతేకు మూడు అడుగుల దూరంలో పడింది. దీంతో దాతే టీమ్‌లోని సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ మోరే అక్కడికక్కడే చనిపోయారు. దాతే సహా మరో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి.
చికిత్సకు వెళ్లకుండా తలపడి..
అయినా చికిత్సకు వెళ్లకుండా దాతే.. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను కొనసాగించారు. 40 నిమిషాల తర్వాత ఆస్పత్రిలోని ఆరో అంతస్తుకు దాతే చేరుకున్నారు. రూఫ్‌టాప్‌కు సమీపంలోని మెట్ల దగ్గరికి దాతే చేరుకోవడాన్ని ఉగ్రవాదులు గుర్తించారు. వెంటనే వాళ్లు మరో గ్రనేడ్ విసిరారు. అది పేలడంతో దాతే కాళ్లు, ముఖానికీ తీవ్రగాయాలై రక్తస్రావం జరిగింది. ఆ వెంటనే ఆస్పత్రి నుంచి ఉగ్రవాదులు పరారయ్యారు.