Site icon HashtagU Telugu

MSP 5 Years : ఐదేళ్లు పంటలకు ‘మద్దతు’ ధర.. కేంద్రం ప్రపోజల్.. ‘చలో ఢిల్లీ’ ఆపేసిన రైతులు

Msp 5 Years

Msp 5 Years

MSP 5 Years : రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొంటాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌ ప్రకటించారు. చండీగఢ్‌లో సోమవారం తెల్లవారుజాము వరకు రైతులతో జరిగిన నాలుగో విడత చర్చల్లో  ఈమేరకు తాము ప్రతిపాదన చేసినట్లు ఆయన వెల్లడించారు. కందులు, మినుములు, మైసూర్‌ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సీసీఎఫ్‌), నాఫెడ్ (ఎన్‌ఏఎఫ్‌ఈడీ) వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. రైతుల నుంచి ఎంత మేర కొనుగోలు(MSP 5 Years) చేస్తారనే దానిపై ఎటువంటి పరిమితి ఉండదని స్పష్టం చేశారు. దీని కోసం ఒక ప్రత్యేక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని పీయూష్ గోయెల్ తెలిపారు. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ స్పందించారు. దీనిపై సోమ, మంగళవారాల్లో తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామన్నారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘చలో ఢిల్లీ’  కార్యక్రమాన్ని నిలిపివేశామని వెల్లడించారు. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.

‘చలో ఢిల్లీ’ పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్ర మంత్రులు ఆదివారం రాత్రి నాలుగో విడత చర్చలు జరిపారు. ఆదివారం సాయంత్రం 8:15 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగింది. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

Exit mobile version