Site icon HashtagU Telugu

Madhya Pradesh & Telangana Proximity : మధ్యప్రదేశ్, తెలంగాణ మధ్య సామీప్యం ఏమిటి?

What Is The Proximity Between Madhya Pradesh And Telangana..

What Is The Proximity Between Madhya Pradesh And Telangana..

By: డా. ప్రసాదమూర్తి

Madhya Pradesh and Telangana Proximity : మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 17వ తేదీన మధ్యప్రదేశ్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 230 స్థానాలకు గాను ఒకే తేదీ ఒకే రోజున పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రకరకాల సర్వేలు, రాజకీయ విజ్ఞుల విశ్లేషణలు, రాజకీయ పార్టీల అంచనాలు, మేధావుల ఊహాగానాలు విరివిగా ప్రచారంలోకి వచ్చాయి. వీటి ఆధారంగా అక్కడ ఏం జరగబోతోంది అనే విషయంలో ఒక అవగాహన కలుగుతుంది. పీపుల్స్ సర్వే వెల్లడించిన మూడ్ ఆఫ్ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రిపోర్టు ప్రకారం మధ్యప్రదేశ్లో రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ కేంద్రీకృతమైంది. అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ఇంచుమించు అన్ని స్థానాల్లోనూ ద్విముఖ పోటీ జరుగుతుంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఈసారి అధికార బిజెపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు అర్థమవుతుంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అక్కడ విజయం నల్లేరు మీద బండి నడక మాత్రం కాదని పలు సర్వేలు చెబుతున్నాయి. రెండు పార్టీల మధ్య అత్యధిక స్థానాల్లో నువ్వా నేనా అన్న టగ్గాఫ్ వార్ వాతావరణం నెలకొంది.

We’re Now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్కు 41 నుంచి 42 శాతం ఓటింగ్ రావచ్చని, బిజెపి 40 శాతం వరకు ఓటింగ్ సంపాదించుకోవచ్చని పీపుల్స్ సర్వే చెబుతోంది. అంటే మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) విజయం ఎవరికీ అంత సునాయాసంగా దక్కేలా కనబడటం లేదు. కాకపోతే 2018 లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర చూస్తే, అక్కడ బిజెపి సాగించిన రాజకీయ క్రీడలు గుర్తుకొస్తాయి. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూలదోసి శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిత్వంలో బిజెపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యతిరేకత మూట కట్టుకుంది. అవినీతి, నిరుద్యోగం మొదలైన అంశాల్లో శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నట్టుగా వినపడుతోంది. ఈ రీత్యా ప్రభుత్వ వ్యతిరేకతను తన అనుకూలతగా మార్చుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ తన విజయావకాశాలను మెరుగుపరుచుకుంది. అయితే ఇరు పార్టీలకు లభించే ఓట్ల శాతం అంచనా ఇంచుమించు ఒకటి రెండు శాతం తేడాలో ఉండడం వల్ల, ఎవరు ఏ విధంగా ఎన్నికలను మేనేజ్ చేస్తారో దాని మీదే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అనుకోవచ్చు.

మధ్యప్రదేశ్, తెలంగాణ మధ్య సామీప్యం (Madhya Pradesh & Telangana Proximity)..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కి, తెలంగాణ (Telangana)కు మధ్య అనేక విషయాల్లో సామీప్యం కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ ఓటర్లలో అక్కడ బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాల పట్ల సానుకూల వైఖరి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఈ విషయంలో తెలంగాణ (Telangana)లో కూడా అధికార బీఆర్ఎస్ కొనసాగించిన, కొనసాగిస్తామని చెబుతున్న పథకాల పట్ల ప్రజలలో సానుకూలత ఉంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా పెరిగింది. ఏమిటి దీనికి కారణాలు అనే విషయంలో అక్కడా ఇక్కడా కొన్ని సమాన ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగం విషయం రెండు రాష్ట్రాల్లోనూ కీలకమైందిగా మారింది. ఉద్యోగ అవకాశాలు మెరుగు కాకపోవడం, యువత తీవ్రమైన అసంతృప్తిలో ఉండడం అక్కడా ఇక్కడా ఒకే రకంగా కనిపిస్తోంది.

Also Read:  Reservation : రిజర్వేషన్.. రివల్యూషన్

తెలంగాణ (Telangana)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడం, పరీక్షల నిర్వహణలో లోపాలు పెరగడం, పరీక్షలు అనేక కారణాలతో మాటిమాటికి వాయిదా వేయడం గత పదేళ్లుగా యువతలో లోలోపలే అసంతృప్తి, ఆగ్రహానికి కారణమైంది. అనేక సర్వేల్లో తెలంగాణలో యువత అధికార పార్టీ అట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు వెల్లడైంది. యువకులకు సంతృప్తికరమైన అవకాశాలను తాము కల్పించలేకపోయాం అన్న వాస్తవాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంగీకరిస్తున్నారు. మరో అంశం అవినీతి. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ పాలన కొనసాగిస్తోందని, లిక్కర్ స్కాం, ధరణి పోర్టల్ లాంటి వాటిలో వేలకోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో కూడా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెలకొంది. పోతే కులాల వారి సమీకరణ మధ్యప్రదేశ్లోను తెలంగాణలోనూ కీలకంగా మారుతుంది.

మధ్యప్రదేశ్లో బీసీ ఓటర్లు మైనారిటీ ఓటర్లు ఈసారి ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్లు కాబోతున్నారు. తెలంగాణలో కూడా గత రెండు దఫాల ఎన్నికల్లో అధికార పార్టీకి అండదండగా ఉన్న ఓబీసీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీలు ఈసారి అటూ ఇటూ చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకుల అంచనాల ద్వారా అర్థమవుతోంది. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రచారం ఊపందుకుంది. ఎంఐఎం, కేసిఆర్ తో గాడమైన బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మైనారిటీ ఓటర్లు ఈసారి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకం కానుంది. ఏమైనప్పటికీ మధ్యప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా రెండు పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ జరుగుతుంది. ఎంపీలో బిజెపి కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అక్కడ కూడా సమాజ్వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు రంగంలో ఉన్నప్పటికీ అవి నామ మాత్రమే. పోటీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్య మాత్రమే కీలకంగా ఉంటుంది.

తెలంగాణలో కూడా బిజెపి, ఎంఐఎం, కమ్యూనిస్టులు రంగంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే రాను రాను పోటీ కేంద్రీకృతమవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా మధ్యప్రదేశ్ తెలంగాణ మధ్య అనేక సామీప్యతలు కనిపిస్తున్నాయి. సర్వేల అంచనా ప్రకారం కూడా రెండు పార్టీలకి ఒకటి రెండు శాతం మాత్రమే ఓటింగ్ లో తేడా ఉంటుందని అర్థమవుతుంది. కాకపోతే తెలంగాణలో ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తి మెజారిటీ రాకపోతే ఇక్కడ బిజెపి, ఎంఐఎం కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అదొక్కటే మధ్యప్రదేశ్ కి, తెలంగాణకి ఉన్న తేడా. చూడాలి.. ఎవరు ఎన్ని అంచనాలు వేసినా, ఎన్ని సర్వేలు చేసినా చివరికి డిసైడ్ చేసేది ఓటర్ మహాశయుడే. ఆ ఓటర్ మదిలో ఏముందో ఎవరూ ఊహించడం సాధ్యం కాదు.

Also Read:  Gaza War : యుద్ధం తర్వాత గాజాపై నియంత్రణ మాదే : నెతన్యాహు