ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో ప్రధాన నిందితుడిగా డాక్టర్ ఉమర్ మహమ్మద్ పేరును అధికారులు గుర్తించారు. హుందాయ్ ఐ20 తెలుపు రంగు కారులో ప్రయాణించిన ఉమర్, అదే వాహనంలో పేలుడులో మరణించి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. పుల్వామా జిల్లాకు చెందిన ఈ వైద్యుడు ప్రస్తుతం హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో ఫిజీషియన్‌గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ బయటపడిన టెరర్ మాడ్యూల్‌తో అతనికి నేరుగా సంబంధం ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఇటీవల కశ్మీర్, ఫరీదాబాద్ మధ్య అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Delhi Bomb Blast : ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు
ఉమర్ మహమ్మద్ నేపథ్యంపై దర్యాప్తు జరిపిన అధికారులు, అతని సహచరులైన అదీల్ అహ్మద్ రాథర్, ముజామిల్ షకీల్ పేర్లను కూడా వెలుగులోకి తెచ్చారు. ఈ ముగ్గురు డాక్టర్లు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసినట్లు ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. అదీల్, షకీల్‌లను ఇప్పటికే జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా అమోనియం నైట్రేట్ కలిగి ఉన్న కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ తల్లి, సోదరుడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అతని కారుకు చెందిన HR26CE7674 నంబర్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ సేకరించగా, పేలుడులో శరీర భాగాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
డాక్టర్ ఉమర్ వ్యక్తిత్వం విషయానికొస్తే, అతను చిన్నతనం నుంచీ అంతర్ముఖ స్వభావం కలిగిన వ్యక్తిగా అతని మేనకోడలు తెలిపింది. ఎక్కువగా చదువుల మీదే దృష్టి పెట్టి, సామాజిక సంబంధాలను దూరంగా ఉంచేవాడని కుటుంబ సభ్యులు వివరించారు. ఫరీదాబాద్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న సమయంలో కూడా అతను తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచినట్లు చెప్పారు. అతని కుటుంబం ఉగ్రవాద సంబంధాల ఆరోపణలను ఖండిస్తూ, “ఉమర్ చదువులో మునిగిపోయే వ్యక్తి, ఇలాంటి పనుల్లో పాల్గొనడమే అసాధ్యం” అని పేర్కొంది. అయినప్పటికీ, పేలుడు స్వభావం, కారు లోపల లభించిన పేలుడు పదార్థాలు, అతని ఫోన్ కాల్ వివరాలు ఇలా అన్ని కలిపి ఢిల్లీ ఉగ్రదాడి వెనుక ఉమర్ ఉన్నాడనే అనుమానాన్ని బలపరుస్తున్నాయి.
