ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేడు (మే 4, 2026) ఉదయం 8 గంటలకు అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఈ ఫలితాలపైనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) వరుసగా నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. అయితే, ఈసారి బీజేపీ గట్టి పోటీని ఇస్తూ రికార్డులను తిరగరాయాలని చూస్తోంది. ప్రస్తుతం అందుతున్న ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం, పోస్టల్ బ్యాలెట్లలో టీఎంసీ మరియు బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బెంగాల్ ఓటరు మళ్ళీ ‘దీదీ’కే పట్టం కట్టారా లేక మార్పును కోరుకున్నారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ముఖ్యంగా భవానీపూర్ వంటి కీలక స్థానాల్లో వచ్చే ఫలితం రాష్ట్రవ్యాప్త ట్రెండ్‌ను నిర్ణయించనుంది.
దక్షిణాదిలో ద్రవిడ రాజకీయం.. కేరళలో మార్పు గాలి?
తమిళనాడులో డీఎంకే (DMK) కూటమి తన పట్టును నిలబెట్టుకోవాలని చూస్తుండగా, అన్నాడీఎంకే (AIADMK) పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే, నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ఈ ఎన్నికల్లో ఎవరి ఓట్లను చీల్చబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రారంభ ట్రెండ్స్‌లో డీఎంకే స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తున్నప్పటికీ, తుది ఫలితం వరకు వేచి చూడాల్సిందే. ఇక కేరళలో ఎల్డీఎఫ్ (LDF) హ్యాట్రిక్ కొడుతుందా లేక యుడీఎఫ్ (UDF) తిరిగి పుంజుకుంటుందా అనే చర్చ సాగుతోంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ యుడీఎఫ్‌కు అనుకూలంగా ఉండటంతో అక్కడ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
అస్సాం, పుదుచ్చేరిలో పట్టు ఎవరిది?
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ దిశగా వెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది. మరోవైపు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే (NDA) మరియు ఇండియా (INDIA) కూటమి మధ్య పోరు సాగుతోంది. సుమారు 90 శాతం ఓటింగ్ నమోదైన పుదుచ్చేరిలో ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉందో చూడాలి. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండటంతో, మరికాసేపట్లో ఈవీఎంల ట్రెండ్స్ అన్నీ రాష్ట్రాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి.
