Ashok Gehlot: గులాం న‌బీ బాట‌న గెహ్లాట్‌?

రాజ్య‌స‌భ వేదిక‌గా కాంగ్రెస్ సీనియ‌ర్ పొలిటీషియ‌న్ గులాం న‌బీ ఆజాద్ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

  • Written By:
  • Updated On - November 1, 2022 / 03:01 PM IST

రాజ్య‌స‌భ వేదిక‌గా కాంగ్రెస్ సీనియ‌ర్ పొలిటీషియ‌న్ గులాం న‌బీ ఆజాద్ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని అవ‌లోక‌నం చేసుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే, కాంగ్రెస్ పార్టీకి గులాంన‌బీ ఆజాద్ గుడ్ బై చెప్పారు. కొత్త పార్టీ పెట్టుకుని ప‌రోక్షంగా క‌శ్మీర్, జ‌మ్మూల్లో బీజేపీకి స‌హ‌కారం అందిస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌.

సేమ్ టూ సేమ్ రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఈ సంఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలోని బ‌న్స్వారాలోని మంగ‌ఢ్ హిల్ లో జ‌రిగిన `మంగ‌ఢ్ ధ‌మ్ కీ గౌర‌వ్ క‌థ‌` కార్య‌క్ర‌మం వేదిక‌గా జ‌రిగింది. అంతేకాదు, అశోక్ గెహ్లాట్‌తో అప్ప‌ట్లో సీఎంగా ఉన్న‌ప్పుడు క‌లిసి ప‌నిచేసిన సంద‌ర్భాల‌ను మోడీ గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. అంటే, త్వ‌ర‌లోనే గులాం న‌బీ ఆజాద్ మాదిరిగా గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారా? అనే సందేహం క‌లుగుతోంది.

Also Read:  Chandrababu Naidu: సింహానికి రాజ‌కీయ బోను

తాను ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్‌తో కలిసి పనిచేశానని ప్రధాని మోడీ చెప్ప‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆలోచింప చేస్తోంది. ‘‘అశోక్ జీ నేను కలిసి సీఎంలుగా పనిచేశాం. మన సీఎంలలో ఆయన అత్యంత సీనియర్‌. ప్రస్తుతం వేదికపై కూర్చున్న వారిలో అశోక్ జీ ఇప్పటికీ సీనియర్-మోస్ట్ సీఎంలలో ఒకరు” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీని ప్రశంసించారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఆయనకు గొప్ప గౌరవం లభిస్తుందని అన్నారు. “ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు, ఆయనకు గొప్ప గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోతుగా పాతుకుపోయిన గాంధీ దేశానికి ఆయన ప్రధానమంత్రి. ప్రపంచం ఈ విషయాన్ని గుర్తించినప్పుడు, ఆ దేశ ప్రధాని తమ వద్దకు వస్తున్నందుకు గర్వపడుతున్నారు’ అని గెహ్లాట్ అన్నారు.

మొత్తం మీద ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, అశోక్ గెహ్లాట్ ప‌ర‌స్ప‌రం ప్ర‌శంసించుకోవ‌డం భ‌విష్య‌త్ రాజ‌స్థాన్ రాజ‌కీయాల‌కు కొత్త పునాదులు పడేలా చేస్తోంది. ఏఐసీసీ అధ్య‌క్ష రేస్ నుంచి చాక‌చ‌క్యంగా త‌ప్పుకున్న గెహ్లాట్ మీద అధిష్టానం గుర్రుగా ఉంది. అంతేకాదు, అక్క‌డ స‌చిన్ పైలెట్ ను సీఎం చేయాల‌ని సోనియా, రాహుల్ చేసిన ప్ర‌య‌త్నాన్ని గెహ్లాట్ అడ్డుకున్నారు. దీంతో భ‌విష్య‌త్ లో కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్ కు ప్రాధాన్యం ఇవ్వ‌ద‌ని అర్థం అవుతోంది. అందుకే, ప్ర‌త్యామ్నాయ వేదిక‌ను త‌యారు చేసుకుంటున్న‌ట్టు మంగ‌ళవారం జ‌రిగిన స‌భ క‌నిపిస్తోంది.

Also Read:   AP Formation Day: నిరాడంబ‌రంగా ఏపీ అవ‌త‌ర‌ణ వేడుక‌లు