Site icon HashtagU Telugu

Visas: ఇకపై ఒక్క రోజులోనే వీసా జారీ!

Visas

Visas

Visas: ఇప్పటివరకు వీసా (Visas) జారీ చేయడానికి కొన్ని వారాల సమయం పట్టేది. అన్ని పత్రాలు సమర్పిస్తే ఇకపై ఒక్క రోజులోనే వీసాను పొందే అవకాశాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో వెసులుబాటు తీసుకొచ్చింది. అట్లాగే అక్రమ వలసదారులు, గడువు మించి ఉండే విదేశీయులపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు డిస్ట్రిక్ట్ పోలీస్ మాడ్యూల్ (DPM), ఫారినర్స్ ఐడెంటిఫికేషన్ పోర్టల్ (FIP) అనే రెండు కొత్త పోర్టల్స్ ను ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో విదేశీ విభాగం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీసాల విధానాల సరళతరం, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించారు.

ఈ సందర్బంగా ఆయా అంశాల్లో పురోగతిని అధికారులకు కేంద్ర మంత్రికి వివరించారు. వీసా విధానాన్ని సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో వీసా పొందేందుకు 26 సబ్ కేటగిరీలుండగా వాటిని 22కి కుదించామని, అట్లాగే గతంలో 104 సబ్ కేటగిరీలుంటే 69కి తగ్గించినట్లు వెల్లడించారు. 2024లో జారీ చేసిన మొత్తం వీసాలలో ఈ వీసాల వాటా (e-Visas) వాటా 65.15 శాతం. వీసా విధానాల సులభతరం వల్ల వీసా జారీ సగటు సమయం కొన్ని వారాల నుండి ఒక రోజులోపు తగ్గినట్లు తెలిపారు.

Also Read: Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు(ICP)ల ఆధునీకరణలో భాగంగా ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్ నమోదు సదుపాయాలను కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 నాటికి దేశంలో 82 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులుండగా, ప్రస్తుతం 114కి (వీటలో 37 ఎయిర్, 37 రోడ్డు, 34 సముద్ర, 6 రైల్వే) పెంచినట్లు వివరించారు. అట్లాగే ఢిల్లి, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్‌లలో ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం (FTI-TTP) అమలు చేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు ప్రీ-వెరిఫైడ్ ప్రయాణికులు ఈ విమానాశ్రయాల్లో కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చునని వివరించారు. త్వరలో ఈ సౌకర్యాన్ని కోజికోడ్, లక్నో, తిరువనంతపురం, అమృత్సర్, తిరుచిరాపల్లి, నోయిడా, నవి ముంబై విమానాశ్రయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు జారీ చేయడంతోపాటు OCI పోర్టల్‌ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన 6 నిర్దిష్ట మైనారిటీ సమూహాల పౌరసత్వ దరఖాస్తుదారులకు సాయం చేయడానికి “CAA-2019” మొబైల్ యాప్ అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈ సందర్బంగా అధికారుల పనితీరును అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వీసా, ఇమ్మిగ్రేషన్ విషయంలో ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు.

Exit mobile version