Site icon HashtagU Telugu

Bunker in Wardrobe : అల్మారాలో ఉగ్రవాదుల రహస్య బంకర్.. వీడియో వైరల్

Terrorists Bunker In Wardrobe

Bunker in Wardrobe : ఉగ్రవాదులు సొరంగాలను వాడే ట్రెండ్‌ను మనం ఇటీవల పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో చూశాం. గాజా ప్రాంతంలోని భూగర్బ సొరంగాల ఆచూకీ రహస్యాన్ని నేటికీ ఇజ్రాయెల్ తెలుసుకోలేకపోయింది. ఈనేపథ్యంలో తాజాగా కశ్మీర్‌లోని ఓ ఇంటిలో  రహస్య బంకర్ ఒకటి బయటపడింది. ఆ బంకర్‌ను పెద్ద అల్మారా (బీరువా) లోపలి నుంచి ..సీక్రెట్‌గా ఎవరికీ కనిపించకుండా నిర్మించడం గమనార్హం. బీరువాలోని పూర్తి దిగువ భాగంలో వెనుక వైపు ఒక డోర్ ఉంది. దాన్ని తెరిస్తే బంకర్(Bunker in Wardrobe) తెరుచుకుంటుంది. బీరువా దిగువ భాగం నుంచి పాకుతూ ఆ సీక్రెట్ బంకరులోకి వెళ్లి దాక్కోవచ్చు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి ఈ బంకర్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా చిన్నిగాం ఫ్రిసాల్‌ గ్రామంలోని ఓ ఇంట్లో నిర్మించినట్లు గుర్తించారు.

శనివారం రాత్రి ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు.. అంతకుముందు ఈ బంకర్‌లోనే(Terrorists hiding in Bunker) దాక్కున్నారని భద్రతా బలగాలు వెల్లడించాయి. అల్మారా వెనుక కనీసం నలుగురు ఉండేలా చిన్నపాటి బంకర్ ఉండటాన్ని మనం వీడియోలో చూడొచ్చు. కుల్గాం జిల్లాలో నలుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో పోరాడుతూ ఒక ఎలైట్ పారా కమాండో సహా ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు.  ఈ ఘటనలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ నివాళులు అర్పించింది.  హతమైన నలుగురు ఉగ్రవాదులను యావర్ బషీర్ దార్, జాహిద్ అహ్మద్ దార్, తౌహీద్ అహ్మద్ రాథర్, షకీల్ అహ్మద్ వనీలుగా గుర్తించారు.వీరిలో ఒకరు స్థానికుడే అని వెల్లడైంది.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు మన దేశ బార్డర్‌లో చైనా ఆగడాలు ఆగడం లేదు.  తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయుధాలు, ఇంధనాన్ని నిల్వ చేసుకొనేందుకు అండర్‌ గ్రౌండ్‌ బంకర్లను డ్రాగన్ సైన్యం నిర్మిస్తోంది. ఆర్మీ వాహనాలకు రక్షణ కల్పించేలా పార్కింగ్‌ నిర్మాణాలు చేస్తోంది. అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ విడుదల చేసిన శాటిలైట్‌ చిత్రాలతో ఈవిషయం వెల్లడైంది. ఈ శాటిలైట్ ఫొటోలను మే 30వ తేదీనే తీశారు. ఈ ఫోటోల ప్రకారం.. పెద్ద అండర్‌ గ్రౌండ్‌ బంకర్‌లోకి వాలుతో కూడిన ఎనిమిది ప్రవేశ మార్గాలు ఉన్నాయి. దానికి సమీపంలో ఐదు ప్రవేశాలతో కూడిన మరో చిన్న బంకర్‌ ఉంది. చైనా ఈ ఆర్మీ బేస్‌ను భారత్‌ తన భూభాగంగా చెబుతున్న ఏరియాలో నిర్మించిందని బ్లాక్‌స్కై అంటోంది. ఈ ప్రాంతం సరిహద్దు వాస్తవధీన రేఖ(ఎల్‌ఏసీ)కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఆందోళనకరం. దీనిపై భారత సైన్యం నుంచి ఇంకా స్పందన రాలేదు.

Also Read :Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీకొడుకు