Vijay Mallya : మాల్యా, నీరవ్, చోక్సీల అరెస్టులో దర్యాప్తు సంస్థలు ఫెయిల్ : కోర్టు

వేల కోట్ల అప్పులు చేసి.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోయిన వ్యవహారంపై ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Written By:
  • Updated On - June 3, 2024 / 03:24 PM IST

Vijay Mallya : వేల కోట్ల అప్పులు చేసి.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోయిన వ్యవహారంపై ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలు సరైన టైంలో అరెస్టు చేయకపోవడం వల్లే వాళ్లంతా దేశం వదిలి పారిపోగలిగారని న్యాయస్థానం పేర్కొంది.  విచారణ సంస్థలు సరిగ్గా స్పందించి ఉంటే.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా పారిపోయే అవకాశం ఉండేది కాదని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

వ్యాపారవేత్త వ్యోమేష్ షా మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆయన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ప్రస్తుతం వ్యోమేష్ షా బెయిల్‌పై బయటే ఉన్నారు. దేశం దాటి వెళ్లొద్దనే షరతుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే ఈ షరతును తొలగించాలని.. విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు తనకు పర్మిషన్ ఇవ్వాలంటూ వ్యోమేష్ షా  ముంబైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై  మే 29న విచారణ జరగగా.. ఈ పిటిషన్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది.  అయితే కోర్టు మాత్రం వ్యోమేష్ షా పిటిషన్‌ను సమర్ధించింది. ఒకవేళ విదేశాలకు వెళ్లేందుకు వ్యోమేష్‌కు అనుమతి ఇస్తే .. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీలా పరారయ్యే ముప్పు ఉందని ఈడీ వాదించింది.

Also Read : Raveena Tandon : రవీనా టాండన్ మద్యం తాగారా ? క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ఈ వాదనను తప్పుపట్టిన కోర్టు.. దర్యాప్తు సంస్థలు సకాలంలో అరెస్టు చేయకపోయినందు వల్లే ఆ ముగ్గురు వ్యాపారవేత్తలు పారిపోగలిగారని తెలిపింది. మాల్యా, నీరవ్, చోక్సీలకు భిన్నంగా వ్యోమేష్ షా కోర్టుకు హాజరై సమన్లకు సమాధానాలు ఇచ్చారని న్యాయస్థానం పేర్కొంది. విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోరుతూ వ్యోమేష్ షా చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నారని కోర్టు గుర్తు చేసింది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీలతో వ్యోమేష్‌ కేసును పోల్చలేమని కోర్టు స్పష్టం చేసింది.

Also Read : Thief Sleep : కన్నం వేసిన ఇంట్లోనే కమ్మటి నిద్ర.. కట్ చేస్తే..

  • వేల కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు.
  • నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
  • మెహుల్ చోక్సీ ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు.
  • విజయ్‌మాల్యా (Vijay Mallya) ప్రస్తుతం బ్రిటన్‌లో దాచుకున్నాడు. అతడు వేలకోట్ల బ్యాంకు లోన్లను ఎగవేశాడు.