Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామం మంగళవారం మధ్యాహ్నం ఘోర విపత్తుకు గురైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా సంభవించిన క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఖీర్ గంగా నది ఉధృతంగా పొంగిపొర్లింది. ఆ నది ఉధృతికి తట్టుకోలేకపోయిన పరిసర ప్రాంతాలు భయంకరమైన వరదను ఎదుర్కొన్నాయి. కొండలపైంచి దూసుకొచ్చిన భారీ నీటి ప్రవాహం చెట్లు, చేమలు, బురద, కొండచరియలను తనతో తీసుకువచ్చి గ్రామంపై విరుచుకుపడింది. ఆ ప్రళయ ప్రవాహం ఎంత వేగంగా దూసుకొచ్చిందంటే, గ్రామంలోని ఇళ్లు, పెద్ద భవనాలు కూడా క్షణాల్లోనే పేకమేడల్లా కూలిపోయాయి.
జలప్రళయం నుంచి బయటపడేందుకు గ్రామ ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టుకుని పరుగులు తీశారు. కానీ ఆ ప్రయత్నాలు చాలామందికి ఫలించలేదు. కళ్లుమూసి తెరిచేలోపే మట్టి, బురద, చెత్త మిశ్రమంతో వచ్చిన ప్రవాహం వారిని ముంచెత్తింది. ఈ భయంకర దృశ్యాల వీడియోలు సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో ఆ ప్రవాహం ఎంతటి ఉధృతితో గ్రామాన్ని మింగేసిందో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 12మంది మృతదేహాలు వెలికితీయగా, మరికొందరిని కోసం రక్షణ బృందాలు గాలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Bandi Sanjay : బీసీల కోసం కాదు? ముస్లింల రిజర్వేషన్ల కోసమే ధర్నా?.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఆగ్రహం
ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాసంస్థలకు నేడు (ఆగస్టు 6) సెలవు ప్రకటించింది. విపత్తు ప్రభావం అధికంగా ఉన్న ధరాలీ గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రక్షణ చర్యల్లో భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమై శవాల శోధనతో పాటు చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇక ఖీర్ గంగా ప్రాంతంలో మరో పెను ప్రమాదం తప్పింది. వరద ప్రవాహంలో కొండచరియలు, బురద భగీరథి నది ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఆ నీరు నిలిచిపోయింది. సమయానికి సహాయక చర్యలు చేపట్టడంతో మరింత పెద్ద విపత్తు నివారించబడిందని అధికారులు తెలిపారు. అయితే ఉత్తరకాశీ జిల్లాలోని మరికొన్ని గ్రామాలకు ఇంకా ముంపు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
స్థానిక ప్రజలు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్‌లు వరుసగా సంభవించడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లోని ప్రకృతి విపత్తుల భయానక రూపాన్ని మళ్లీ ఒక్కసారిగా గుర్తుచేసింది.
Indian Army: భారత్- పాక్ మధ్య భీకర కాల్పులు.. అసలు నిజమిదే!