- లోక్‌సభలో ఉద్రిక్తత
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు
- అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు
Lok Sabha: లోక్‌సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ‘జీ రామ్ జీ’ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ప్రియాంక గాంధీ విమర్శలు
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. పేర్లు మార్చాలనే ఈ పిచ్చి అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా కేంద్రం తన నియంత్రణను పెంచుకుని, బాధ్యతను తగ్గించుకుంటోందని ఆమె ఆరోపించారు. ఉపాధి కల్పించే రోజుల సంఖ్యను పెంచినప్పటికీ రోజువారీ కూలీ మాత్రం పెంచలేదని విమర్శించారు. ప్రతి పథకం పేరు మార్చడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అవుతుందని, చర్చలు జరపకుండా ఈ బిల్లును ఆమోదించకూడదని డిమాండ్ చేశారు.
Also Read: నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా
ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకుని లోతైన పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని ఆమె కోరారు. ఏ బిల్లు కూడా ఎవరి వ్యక్తిగత ప్రతిష్ట కోసమో లేదా పక్షపాతంతోనో ప్రవేశపెట్టకూడదని హితవు పలికారు.
ప్రభుత్వం కౌంటర్
ప్రతిపక్షాల విమర్శలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘాటుగా స్పందించారు. ఈ బిల్లు ‘రామరాజ్య’ స్థాపన కోసమని, బిల్లులో ‘రామ్’ అనే పేరు ఉండటం వల్లే ప్రతిపక్షాలకు సమస్యగా మారిందని ఆయన అన్నారు. ఈ బిల్లు పేదల సంక్షేమం కోసమని, ఇది భారత్ సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. “మహాత్మా గాంధీ మా హృదయాల్లో ఉన్నారు. రాముడు మా అణువణువునా ఉన్నాడు. గాంధీ గారు కూడా రామరాజ్యం గురించి మాట్లాడేవారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
సభ వాయిదా, నిరసనలు
విపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్న పోస్టర్లను పట్టుకుని నిరసన తెలిపారు. ‘మహాత్మా గాంధీ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకించారు.
