NEET UG Results : నీట్-యూజీ పరీక్షల ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం(ఈనెల 20న) మధ్యాహ్నం 12 గంటలలోగా నీట్-యూజీ అభ్యర్థులందరి పరీక్షా ఫలితాలను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో నగరాల వారీగా, ఎగ్జామ్ సెంటర్ల వారీగా అప్‌లోడ్ చేయాలని ఎన్‌టీఏకు నిర్దేశించింది. అయితే ఈ ఫలితాల లిస్టులలో అభ్యర్థుల గుర్తింపు ఎవరికీ కనిపించకుండా మాస్కింగ్ చేయాలని కోరింది. నీట్-యూజీ పరీక్షలో(NEET UG Results) పారదర్శకత ఉందనే నమ్మకాన్ని అభ్యర్థుల్లో కలిగించేందుకు విద్యార్థులందరి ఫలితాలను ప్రకటించాలని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నరేంద్ర హుడా సుప్రీంకోర్టును కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న దేశ సర్వోన్నత న్యాయస్థానం.. ఎన్టీఏకు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం(Supreme Court) ఈ ఆర్డర్స్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఏం జరుగుతోంది అంటే.. పాట్నా, హజారీబాగ్‌లలో ప్రశ్నాపత్రం లీకేజీ జరిగింది.అక్కడ కొంతమందికి ప్రశ్నపత్రాలు పంపిణీ అయ్యాయి. అయితే ఈ లీకేజీ ఆ కేంద్రాలకే పరిమితమైందా ? ఇతర రాష్ట్రాలకు కూడా ప్రశ్నపత్రం సర్క్యులేట్ అయిందా ? అనేది తెలియాల్సి ఉంది’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ విచారణ సందర్భంగా అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నీట్-యూజీ పరీక్ష ఫలితాలు తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. వారికి మొత్తం ఫలితాలు తెలియాలి. అయితే వారి గుర్తింపు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కేంద్రాల వారీగా మార్కులు ఎలా వచ్చాయో విశ్లేషించుకొని తదుపరిగా సమీక్షించుకుందాం’’ అని సీజేఐ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.నీట్-యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణను కోరుతూ దాఖలైన దాదాపు 40 పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈక్రమంలోనే ఈరోజు కూడా విచారణ జరిగింది. తదుపరి విచారణను జులై 22వ తేదీన ఉదయం 10.30 గంటలకు కోర్టు వాయిదా వేసింది.