రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ (యూపీ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో హెల్మెట్ – నో ఫ్యూయెల్’ (‘No Helmet, No Fuel’ ) విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నియమాల ప్రకారం హెల్మెట్ ధరించని వ్యక్తులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించవద్దని అధికారిక ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా ప్రజల జీవితాలను కాపాడటం, రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు శాఖను మరియు సంబంధిత అధికారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi) ఆదేశించారు.
Gautam Adani : ‘‘ఆ దేవుడు ఆదేశించాడు.. ఈ అదానీ పాటించాడు’’ : గౌతం అదానీ
యూపీలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 25,000-26,000 మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని ఇటీవల సీఎం యోగి వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కఠిన చర్యలు అవసరమని గుర్తించిన ప్రభుత్వం, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని నియంత్రించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రజల భద్రతకే తమ ప్రాధాన్యత అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనల అమలుతో పాటు, హెల్మెట్ ధరించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ఈ విధానం వల్ల రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇంధనం పొందడం కోసం హెల్మెట్ ధరించడం పట్ల ప్రజలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు.
ప్రజల ప్రాణాల రక్షణకై తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే కొన్ని వర్గాలు ఈ విధానం అమలులో ప్రత్యక్ష అనుభవాలు ఎలా ఉంటాయో వేచిచూడాలని అభిప్రాయపడుతున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడటమే కాకుండా, భద్రతాపరమైన మార్గాల్లో ముందడుగు వేయవచ్చని ఈ చర్య అందరికీ స్పష్టంగా తెలిపింది.