Site icon HashtagU Telugu

Pakistan Attack: 26 ప్రదేశాల్లోకి పాక్ డ్రోన్లు.. నాలుగు ఎయిర్‌బేస్‌లపై దాడి

Pakistan Attack Indian Air Bases India Vs Pakistan

Pakistan Attack: భారత్‌లోని ఉధంపూర్, భుజ్, పఠాన్ కోట్, భటిండాలలో ఉన్న వాయుసేన ఎయిర్ బేస్‌లపై పాకిస్తాన్ ఆర్మీ శుక్రవారం అర్ధరాత్రి దాడులకు పాల్పడింది.  భారత్‌లోని పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ యుద్ధ విమానాలు వచ్చాయి.  పంజాబ్‌లో ఉన్న ఒక వాయుసేన ఎయిర్‌బేస్‌పైకి పాకిస్తాన్ హైస్పీడ్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ఈవివరాలను ఈరోజు (శనివారం) న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. పాకిస్తాన్ చర్యలు భారత్‌ను రెచ్చగొట్టేలా, కవ్వించేలా ఉన్నాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ దాడులకు భారత్ తగిన రీతిలో అప్పటికప్పుడు స్పందించిందన్నారు.

Also Read :Operation Kagar : ‘ఆపరేషన్ కగార్‌’‌పై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఎఫెక్ట్‌ .. కీలక ఆదేశాలు

పాక్‌ బలగాలు ముందుకు వస్తున్నాయి : విక్రమ్ మిస్రి 

‘‘శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు పాక్ దాడులకు .. భారత సేనలు బలంగా స్పందించాయి. భారత  సేనలు పాక్‌లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లపై దాడి చేశాయి. భారత వాయుసేన కూడా యుద్ధ విమానాలతో పాక్‌ కీలక స్థావరాలపై దాడులు చేసింది. పాక్‌లోని ఎయిర్‌లాంఛర్లను ధ్వంసం చేసింది. పాక్‌ బలగాలు సరిహద్దు వైపు ముందుకు వస్తున్నట్లు మేం గుర్తించాం’’ అని విక్రమ్ మిస్రి చెప్పారు. ‘‘పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది. ఇది పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదకర చర్య’’ అని ఆయన పేర్కొన్నారు. భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్‌ స్టాంప్‌లు ఉన్న వీడియోలు, ఫొటోలను ప్రదర్శించారు.

Also Read :Indian Airports Shut: భారత్‌ – పాక్‌ టెన్షన్స్.. 32 ఎయిర్‌పోర్టుల మూసివేత

స్కూళ్లు, ఆస్పత్రులపైనా పాక్ దాడులు

మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ(Pakistan Attack) మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ శ్రీనగర్, అవంతిపొరా, ఉధంపూర్‌ పరిధిలోని స్కూళ్లు, ఆస్పత్రులపైనా దాడి చేసింది. దాడుల కోసం పాకిస్తాన్ మిస్సైళ్లు, డ్రోన్లు, సూసైడ్ డ్రోన్లు, యుద్ధ విమానాలను వాడింది’’ అని వెల్లడించారు. ‘‘పాకిస్తాన్ సైన్యం శుక్రవారం అర్ధరాత్రి భారత్‌లోని 26కిపైగా ప్రదేశాలలో గగనతలంలోకి చొరబడటానికి యత్నించింది. వీటిలో బారాముల్లా, శ్రీనగర్, అవంతిపొరా, జమ్మూ, పఠాన్‌కోట్, భుజ్, జైసల్మేర్‌ ఉన్నాయి. ఆయా డ్రోన్లను భారత్ కూల్చేసింది’’ అని సోఫియా తెలిపారు. ‘‘భారత్‌కు చెందిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్టుగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అందులో నిజమేం లేదు’’ అని వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పారు.