Site icon HashtagU Telugu

Tragedy : కీచక ప్రొఫెసర్ల వేధింపులకు వైద్య విద్యార్థిని బలి

Suicide

Suicide

Tragedy : భారత విద్యా రంగంలో ఇటీవల ఆత్మహత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యాపకుల వేధింపులు, మానసిక ఒత్తిడులు విద్యార్థులను తీవ్రమైన మానసిక స్థితికి నెట్టివేస్తున్నాయనే ఉదాహరణలు వరుసగా బయటపడుతున్నాయి. ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరువక ముందే, గ్రేటర్ నోయిడాలోని శారద యూనివర్సిటీలో దంతవైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటనల జాడ ఇంకా చెరిగిపోక ముందే తాజాగా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మరో వైద్య విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో పాటు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఉదయపూర్‌లోని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్‌లో శ్వేతా సింగ్ అనే బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం అధికారులు ఈ విషాదాన్ని ధృవీకరించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో శ్వేతా రూమ్‌మేట్ ఆమెను ఉరివేసుకున్న స్థితిలో కనుగొని, వెంటనే హాస్టల్ సిబ్బంది మరియు పోలీసులకు సమాచారం అందించింది.

Supreme Court : విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక చర్య.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు మార్గదర్శకాలు

అధికారుల ప్రకారం, శ్వేతా రాసిన సూసైడ్ నోట్‌లో అధ్యాపకులే తన ఆత్మహత్యకు కారణమని స్పష్టంగా పేర్కొంది. పరీక్షలను సకాలంలో నిర్వహించకపోవడం, తరచూ మానసిక వేధింపులు ఇవ్వడం వల్ల తాను తీవ్ర ఆందోళనలో పడిపోయానని ఆమె రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులు కళాశాల ముందు ఆందోళన ప్రదర్శన చేపట్టారు. రోడ్డును దిగ్బంధిస్తూ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆందోళన పెరుగుతుండటంతో కళాశాల డైరెక్టర్ స్వయంగా ముందుకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. సూసైడ్ నోట్‌లో పేర్లు ఉన్న అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యత తప్పించుకోబోమని హామీ ఇచ్చారు. ఇప్పటికే సంబంధిత సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.

సుఖేర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రవీంద్ర చరణ్ ప్రకారం, విద్యార్థిని మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతే పోస్టుమార్టం చేపడతామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు సురక్షితమైన వాతావరణంలో చదువుకునేలా తగిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు స్పష్టం చేశారు.

ఒడిశా, నోయిడా, ఉదయపూర్ ఘటనలు కలిపి చూస్తే, విద్యా సంస్థలలో విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి స్పష్టమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్యార్థుల సమస్యలను సకాలంలో పరిష్కరించే కౌన్సెలింగ్ సౌకర్యాలు లేకపోవడం, అధిక ఒత్తిడులు, సపోర్టివ్ వాతావరణం లోపించడం ఈ తరహా ఘటనలకు కారణమవుతున్నాయి.

IRCTC : రైళ్లలో ఆహార నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదులు..కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందన