Wild Animals Attacks : ఘోరం జరిగింది. వన్యప్రాణుల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. చిరుతపులి దాడిలో ఒక చిన్నారి చనిపోగా, తోడేలు దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలు కలకలం రేపాయి.
Also Read :Israeli Attack : మసీదుపై ఇజ్రాయెల్ దాడిలో 21 మంది మృతి.. వైట్‌హౌస్ ఎదుట ఏమైందంటే ?
మొదటి ఘటన..
సౌత్ ఖేరీ అటవీ డివిజన్ పరిధిలోని శారదానగర్ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే గంగాబెహర్ గ్రామంలో(Wild Animals Attacks) మొదటి సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం తన తండ్రి సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్న సాజేబ్ అనే 12 ఏళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. ఆ పిల్లవాడిని చంపి, అడవుల్లోకి లాక్కొని వెళ్లింది. అతడి మృతదేహాన్ని గ్రామానికి 500 మీటర్ల దూరంలోని చెరకుతోటలో శనివారం రాత్రి గుర్తించారు. చనిపోయిన బాలుడి తండ్రి మునవ్వర్ మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి సైకిల్‌పై ఎరువుల బస్తాలను తోసుకుంటూ ఊరి వైపు వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మా అబ్బాయి వచ్చే దారిలోదట్టమైన చెరకు పొలాలు ఉన్నాయి. ఆ చెరుకు తోటల్లో దాక్కున్న చిరుతపులి అకస్మాత్తుగా మా అబ్బాయిపై దాడి చేసింది. అనంతరం సాజేబ్‌ను చెరుకు పొలాల్లోకి లాక్కొని వెళ్లింది. చాలా వెతికిన తర్వాత మా అబ్బాయి డెడ్‌బాడీని గుర్తించాం’’ అని వివరించారు. ఈ దుర్ఘటనలో తమ అబ్బాయిని కోల్పోయినందుకు మునవ్వర్ కన్నీటి పర్యంతమయ్యారు.
రెండో ఘటన..
రెండో విషాద సంఘటన శుక్రవారం రాత్రి పాదువా పోలీసు స్టేషను పరిధిలోని కుర్తైహా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామం దుధ్వా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. కుర్తైహా గ్రామంలోని ఓ ఇంట్లోకి తోడేలు ప్రవేశించి, రిజా బానో అనే మూడేళ్ల బాలికను చంపింది. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని అడవుల్లోకి బాలిక డెడ్‌బాడీని లాక్కెళ్లింది. అనంతరం శనివారం ఉదయం ఊరికి సమీపంలోని ఘఘ్రా నదిలో బాలిక డెడ్ బాడీ తేలుతూ కనిపించింది. అయితే ఈప్రాంతంలో తోడేళ్ళ ఉనికి ఇంతకు ముందు ఎప్పుడూ నివేదించబడలేదని అటవీ అధికారులు తెలిపారు. బహుశా చిరుతపులి ఈ దాడికి పాల్పడి ఉండొచ్చన్నారు.