Site icon HashtagU Telugu

China-India : ట్రంప్‌ చర్యలు..భారత్‌-చైనా మధ్య వ్యాపార సంబంధాలు బలపడుతున్నాయా?

Trump's actions... are trade relations between India and China strengthening?

Trump's actions... are trade relations between India and China strengthening?

China-India : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేపట్టిన ఆర్థిక విధానాల ప్రభావం అంతర్జాతీయ వాణిజ్య రంగంపై కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన రష్యా నుండి చమురు దిగుమతులపై పెనాల్టీలు, టారిఫ్‌లు విధించిన చర్యల ప్రభావం ఆసియా దేశాల మధ్య వ్యాపార సంబంధాలను కొత్త దిశలో నడిపిస్తోంది. దీని ప్రభావంగా భారత్‌-చైనా మధ్య వాణిజ్య భాగస్వామ్యం గట్టిపడుతోంది. ఈ పరిణామాల్లో నయార ఎనర్జీ (Nayara Energy) కీలక పాత్ర పోషిస్తోంది. గుజరాత్‌లోని వడినార్‌ రిఫైనరీని కలిగి ఉన్న ఈ సంస్థలో రష్యా పెట్రోలియం దిగ్గజం రోస్‌నెఫ్ట్‌కి 49 శాతం వాటా ఉంది. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలు ఈ సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకంగా ఐరోపా సమాఖ్య దేశాలు ఇటీవల నయారపై ఆంక్షలు విధించడంతో ఇది ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చైనా దిశగా మొగ్గు చూపుతోంది.

చైనాకు తొలి డీజిల్‌ సరఫరా.. 2021 తర్వాత తొలి డీల్‌

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం, నయార ఎనర్జీ “ఈఎం జెనిత్‌” అనే నౌక 4,96,000 బ్యారెళ్ల అల్ట్రా లో సల్ఫర్‌ డీజిల్‌తో జూలై 18న చైనా వైపు ప్రయాణం ప్రారంభించింది. 2021 తర్వాత చైనాకు ఇది నయార పంపిన తొలి డీజిల్‌ షిప్‌మెంట్‌గా గుర్తిస్తున్నారు. వాస్తవానికి ఈ సరఫరా మలేషియాకు వెళ్లాల్సి ఉండగా, ఐరోపా ఆంక్షల ప్రభావంతో మలక్కా జలసంధిలో మార్గం మళ్లించబడింది. ప్రస్తుతం ఇది చైనాలోని జౌషాన్‌ పోర్ట్‌ వైపు ప్రయాణిస్తోంది.

అమెరికా, ఐరోపా సంస్థల నిషేధాల ప్రభావం

నయార్‌పై విదేశీ ఆంక్షలు పడటం వల్ల దాని డేటా సేవలను మైక్రోసాఫ్ట్‌ నిలిపివేసింది. అదే విధంగా భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా తమ బ్యాంకింగ్‌ సేవలను నిలిపివేసినట్లు సమాచారం. ఫలితంగా సంస్థ ప్రస్తుతం డీలింగ్‌లలో ముందస్తు చెల్లింపులు లేదా లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఆధారంగా వ్యవహరించాలనే దిశగా ప్రయత్నిస్తోంది.

18వ ఆంక్షల ప్యాకేజీ ప్రభావం

2025 జులై నుండి అమల్లోకి వచ్చిన ఐరోపా సమాఖ్య 18వ ఆంక్షల ప్యాకేజీ కారణంగా, రష్యా చమురుతో వ్యాపారం చేసే సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ ఆంక్షల ప్రకారం, రష్యా చమురు దిగుమతికి ధరపై పరిమితులు విధించబడ్డాయి – ప్రధానంగా బ్యారెల్‌కి 47.6 డాలర్ల పరిమితితో. నయార ఎనర్జీ వంటి సంస్థలు దీనివల్ల తమ సాధారణ వ్యాపార వ్యూహాల్లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వ్యాపార పునర్వ్యవస్థీకరణ వైపు భారత్‌

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ కూడా తన అంతర్జాతీయ వ్యాపార మౌలిక సదుపాయాలపై పునఃపరిశీలన చేస్తోంది. చైనా, రష్యాలతో వ్యాపార మార్గాలను శక్తివంతం చేయడంలో భారత్‌ ఆసక్తిని చూపుతోంది. అమెరికా-యూరప్‌ ఆంక్షల కారణంగా ఎగుమతి, దిగుమతుల్లో అంతరాయాలు ఎదురవుతున్నాయి. దీని పరిష్కారంగా పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఆసియా దేశాల మధ్య నూతన భాగస్వామ్యాలకు నయార ఎనర్జీ ప్రయత్నిస్తుంది. ఈ తాజా పరిణామాలు ఒక్క నయార ఎనర్జీనే కాక, గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశముంది. ట్రంప్‌ విధానాల పర్యవసానంగా భారత్‌, చైనా మధ్య పెరుగుతున్న వ్యాపార సహకారం భవిష్యత్తులో మరింత ఊపందుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో ఈ మార్పులు ఎంత దూరం తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే.

Read Also: Kancha Gachibowli Issue : తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. సమగ్ర ప్రణాళికతో వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తాం: సుప్రీంకోర్టు