Site icon HashtagU Telugu

Anand Mahindra : ట్రంప్ సుంకాలు ..భారత్‌కు సంక్షోభమా? అవకాశమా? ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు

Trump tariffs..a crisis for India? Anand Mahindra's key comments

Trump tariffs..a crisis for India? Anand Mahindra's key comments

Anand Mahindra : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత్‌కు ఆర్ధికంగా పెనుసవాలుగా మారింది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో, ట్రంప్ భారతదేశంపై విధించే దిగుమతి సుంకాలను 50 శాతం వరకు పెంచారు. ఈ ఆర్థిక చర్యపై భారత్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా తన స్పందనలో ఇది భారత్‌కు అర్థశాస్త్ర పరంగా పెద్ద పరీక్ష. కానీ ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కూడా తెస్తుంది. ఈ సందర్భాన్ని వినియోగించుకుంటే దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయవచ్చు అని అన్నారు. అమెరికా సుంకాల పెంపు ప్రపంచ వ్యాపార సమీకరణాల్లో ఊహించని మార్పులను తెచ్చినట్లు ఆయన తెలిపారు.

Read Also: Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..సెప్టెంబర్ 9న పోలింగ్‌

అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు తమ తమ వ్యూహాలను మళ్లీ పరిగణనలోకి తీసుకున్నాయని, వాటి ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యాప్తికి కొత్త మార్గాలు కనిపిస్తున్నాయని ఆనంద్ తెలిపారు. భారత్ కూడా ఇదే దిశగా ఆలోచించాలని సూచించారు. అంతేకాదు, 1991లో విదేశీ మారక నిల్వల సంక్షోభం భారత్‌ను లిబరలైజేషన్ దిశగా నడిపించిందని గుర్తు చేశారు. అప్పటి సంక్షోభం దేశానికి మార్గదర్శిగా మారినట్టు, ఇప్పటి సుంకాల ఒత్తిడిని కూడా అదేలా మలచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్షణాల్లో దేశానికి రెండు కీలక అడుగులు ఎంతో అవసరం. అవి తీసుకుంటే, మనం ఈ సుంకాల మధనంలోనుంచి అమృతాన్ని పొందగలుగుతాం అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భారత్‌ను ప్రపంచ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆశయాన్ని ఆయన పంచుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ విధానాలలో పారదర్శకత, వేగం, మరియు మరింత చురుకుతనం అవసరమని తెలిపారు.

ముఖ్యంగా ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ ర్యాంకింగులో భారత్ మరింత మెరుగుపడాలని సూచించారు. విదేశీ మారక నిల్వల పెంపు కోసం పర్యాటక రంగాన్ని కీలక సాధనంగా మలచుకోవాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల విదేశీ కరెన్సీ ప్రవాహం పెరగడమే కాకుండా, దేశీయంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని చెప్పారు. ఇక, తయారీ రంగంపై దృష్టి పెట్టే సమయం ఇదేనని సూచించారు. దిగుమతులపై సుంకాలను సమర్థవంతంగా పునఃపరిశీలించి, స్వదేశీ తయారీని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడుతుందని చెప్పారు. మొత్తం చూసుకుంటే, ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయం ఒక దారుణమైన సంక్షోభంలా కనిపించినా, అది దేశానికి కొత్త ఆర్థిక మార్గాలకూ, స్వావలంబన లక్ష్యాలకూ దారితీసే అవకాశం కూడా కావచ్చని ఆనంద్ మహీంద్రా స్పష్టంగా చెప్పినట్లు కనిపిస్తోంది.

Read Also: Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్‌ టారిఫ్‌ల పై స్పందించిన ప్రధాని మోడీ