Meta Apology : ‘‘వివిధ దేశాల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయి’’ అంటూ ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. మెటా కంపెనీకి భారత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ) అధిపతి నిశికాంత్ దూబే సమన్లు జారీ చేశారు. జనవరి 20 నుంచి 24లోగా కమిటీ ఎదుట హాజరై.. జుకర్ బర్గ్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో మెటా ఇండియా కంపెనీ స్పందించింది. భారత ప్రభుత్వానికి సారీ చెప్పింది.
Also Read :Futuristic Robotic Mules : ఆర్మీ రోబోలు ఇవిగో.. ఆర్మీ డే పరేడ్‌తో బరిలోకి.. ఇవేం చేస్తాయంటే ?
జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యల అంశంలో భారత ప్రభుత్వానికి సారీ చెబుతూ మెటా ఇండియా(Meta Apology) ఉపాధ్యక్షుడు శివనాథ్ థుక్రాల్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. తమ కంపెనీ సీఈఓ జుకర్‌బర్గ్ అనుకోకుండా ఆ వ్యాఖ్య చేశారని ఆయన తెలిపారు. 2024లో వివిధ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడాయని జుకర్‌బర్గ్ చెప్పారని.. ఆ దేశాల్లో భారత్ లేదని శివనాథ్ థుక్రాల్ తేల్చి చెప్పారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. మెటా కంపెనీకి భారత్ చాలా ముఖ్యమైందని తెలిపారు.
Also Read :Tirupati : మంచు మనోజ్‌కు పోలీసుల నోటీసులు
జుకర్‌బర్గ్ ఏమన్నారు ?
జో రోగన్ అనే యూట్యూబర్‌కు ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘2024లో వివిధ ప్రపంచ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినట్లు రుజువైంది. భారత్‌లోనూ స్పష్టంగా ఆ ట్రెండ్ కనిపించింది. ధరల మంట (ద్రవ్యోల్బణం), కరోనా సంక్షోభ కాలంలో అమలుచేసిన అడ్డదిడ్డమైన ఆర్థిక విధానాల ప్రతికూల ప్రభావంతో అధికార పార్టీలపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. దాని పర్యవసానం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చాలాదేశాల్లో అధికార పార్టీలు గద్దె దిగాల్సి వచ్చింది’’ అని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు.