Yusuf Pathan : పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రపంచదేశాలకు వివరించేందుకు మోడీ సర్కారు ఎంపిక చేసిన అఖిలపక్ష ఎంపీల జాబితాలో యూసుఫ్ పఠాన్ పేరుంది. టీఎంసీ తరఫున అఖిల పక్ష బృందం కోసం యూసుఫ్‌ను ఎంపిక చేశామని కేంద్ర సర్కారు తెలిపింది. అయితే దీనిపై టీఎంసీ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భగ్గుమన్నారు. తమ అభిప్రాయం తీసుకోకుండానే.. తమ పార్టీ ఎంపీని అఖిల పక్ష బృందం కోసం ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. తాము సూచించిన వారికే అఖిల పక్ష టీమ్‌లో అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన అఖిలపక్ష టీమ్‌తో కలిసి పర్యటనకు యూసుఫ్ పఠాన్ వెళ్లడం లేదని స్పష్టంచేశారు.
Also Read :Mysore Rajamata : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత భారీ విరాళం.. ప్రమోదాదేవి గురించి తెలుసా ?
యూసుఫ్ పఠాన్ రియాక్షన్ ఇదీ..
ఈ అంశంపై టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్(Yusuf Pathan) కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన అఖిలపక్ష టీమ్‌తో కలిసి తాను విదేశీ పర్యటనకు వెళ్లేది లేదన్నారు. టీఎంసీ హైకమాండ్ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తానని ఆయన వెల్లడించారు. జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో సభ్యుడిగా యూసుఫ్ పఠాన్‌కు కేంద్ర సర్కారు చోటు కల్పించింది. ఈ టీమ్ ఇండోనేషియా, మలేషియా, కొరియా రిపబ్లిక్, జపాన్, సింగపూర్ దేశాలలో పర్యటించనుంది. ఈ టీమ్‌లో సభ్యులుగా మాజీ జర్నలిస్ట్ మోహన్ కుమార్, ప్రధాన్ బారువా, బ్రిజ్ లాల్, అపరాజిత సారంగి, బీజేపీ నేత హేమాంగ్ జోషి, సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్ , కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు. మొత్తం 7 అఖిలపక్ష టీమ్‌లు మే 21న భారత్ నుంచి బయలుదేరుతాయి. జూన్ మొదటి వారంకల్లా ఈ టీమ్‌ల పర్యటన ముగుస్తుంది.