Elections Today : జార్ఖండ్ రాష్ట్రంలో తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళ జరుగుతోంది. 43 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. దీంతోపాటు 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈరోజు జరుగుతోంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలోనూ ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈసారి రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు. అన్నిచోట్లా పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓట్లు వేసే ప్రక్రియ కొనసాగుతుంది. జార్ఖండ్‌లో తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) దాదాపు 13 శాతం పోలింగ్ నమోదైంది. జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న పోలింగ్ స్టేషనులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఓటువేశారు. ఈ రాష్ట్రంలో రెండో విడతగా 38 స్థానాల్లో నవంబరు 20న పోలింగ్ జరుగుతుంది. ఈ అన్ని స్థానాలకు సంబంధించిన ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలు నవంబరు 23న వెలువడతాయి.
Also Read :Vivek Ramaswamy : ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్, వివేక్ రామస్వామి.. ‘గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ పగ్గాలు
ఉత్సాహంతో ఓటు వేయండి : ప్రధాని మోడీ
‘‘ఇవాళ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్లా ప్రజలు పూర్తి ఉత్సాహంతో ఓటు వేసేందుకు(Elections Today) కదం తొక్కండి. ఇది ప్రజాస్వామ్యపు పండుగ. దీనిలో తప్పకుండా అందరూ పాల్గొనాలి. తొలిసారి ఓట్లు వేస్తున్న యువతరానికి నా శుభాకాంక్షలు. ఉదయం లేవగానే ఓటు వేయండి.. ఆ తర్వాతే మిగతా పనులు చేసుకోండి’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓటర్లను కోరారు.
ఒక అవకాశం ఇవ్వండి : ప్రియాంకాగాంధీ
‘‘నాకు వయనాడ్ ప్రజలు ఒక అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే.. వారికి నా ప్రేమను పంచుతాను. వయనాడ్ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాను. వారి ప్రతినిధిగా ముందుకు సాగుతాను’’ అని ప్రియాంకాగాంధీ అన్నారు. ‘‘వయనాడ్‌లో ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోండి’’ అని ఆమె పిలుపునిచ్చారు.
పాలన నచ్చి ఉంటే.. ఓటేయండి : సీఎం సోరెన్
‘‘నా ప్రభుత్వ పాలన నచ్చి ఉంటే.. ఈసారి కూడా మా పార్టీ(జేఎంఎం)కి ఓటు వేయండి. వచ్చే ఐదేళ్లలో రాబోయే పదేళ్లకు సరిపడా డెవలప్మెంట్ పనులు చేసి పెడతా. జార్ఖండ్ ముందుకు సాగాలంటే జేఎంఎం గెలవాల్సిందే’’ అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఓటర్లను కోరారు.