Ramzan 2025: సౌదీ అరేబియాలో ఈరోజు (ఆదివారం) రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. అక్కడ శనివారం రోజే 1446 షవ్వాల్ నెలకు సంబంధించిన నెలవంక కనిపించింది. దీంతో ఆదివారం రోజే పండుగను జరుపుకోవాలని ప్రకటించారు. ఈనేపథ్యంలో భారత్‌లో రేపు (సోమవారం) రంజాన్ పండుగ జరిగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం భారత్‌లో నెలవంక దర్శనమిచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో పవిత్ర రంజాన్(Ramzan 2025) మాసం మార్చి 2వ తేదీన మొదలైంది. ఈదుల్ ఫితర్ మార్చి 31న (సోమవారం) జరగనుంది.
రంజాన్ మాసం విశిష్టతల గురించి..
- రంజాన్ మాసం సహనం, ఓపిక, దైవారాధన, దాతృత్వంల మేళవింపు.
- ఈ మాసంలో ముస్లింల ఉపవాసాలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి.
- ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాసాన్ని పాటిస్తారు.ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం కొనసాగుతుంది.
- 12 ఏళ్ల వయస్సు దాటిన వారంతా ఉపవాస దీక్ష పాటిస్తారు.
- ఉపవాసాన్ని ప్రారంభించే క్రమంలో చేసే భోజనాన్ని సహర్ అంటారు.
- ఉపవాసాన్ని ముగించే క్రమంలో చేసే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు.
- దాదాపు 14 గంటల పాటు ఆహారం, పండ్లు, ఫలహారాలు, టీ, శీతల పానీయాలు, నీరు, చివరకు ఉమ్మి కూడా మింగకుండా కఠినంగా ఉపవాస దీక్ష పాటిస్తారు.
- ఈవిధంగా ఉపవాసం ఉండటం వల్ల వ్యక్తిలో ఓపిక, సహనం, పేదల ఆకలి దప్పుల బాధ తెలుస్తాయి.
- రంజాన్ మాసంలోని 26వ రోజు రాత్రి ఖురాన్ అవతరించింది. అందుకే ఆ రోజు రాత్రి షబ్ ఏ ఖదర్‌ను జరుపుకుంటారు.
- రంజాన్ వేళ ప్రతిరోజూ ఐదు వేళల నమాజ్ చదువుతారు. రాత్రి ప్రత్యేకంగా తరావీహ్ నమాజును ఆచరిస్తారు.
- దివ్య ఖురాన్‌లో 30 భాగాలు ఉన్నాయి. వీటిని రోజుకు ఒక భాగం చొప్పున, 30 రోజుల్లోగా మొత్తం ఖురాన్ పఠనాన్ని పూర్తి చేస్తారు.
- ప్రతి ముస్లిం తన నికర ఆదాయంలో కొంత భాగాన్ని జకాత్ పేరిట దానం చేస్తారు.
- ఈనెలలోనే ప్రతి వ్యక్తీ ఫిత్రా పేరుతో నగదు లేదా గోధుమలు దానం చేస్తుంటారు.
- రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తారు.