Site icon HashtagU Telugu

Kashmir : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Kashmir Encounter Militants Killed

Kashmir : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.  వీరిలో ఇద్దరు ఉగ్రవాదులను మచిల్ సెక్టార్‌ వద్ద, మరో ఉగ్రవాదిని తంగ్‌ధర్ సెక్టార్‌లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈవివరాలను భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ధ్రువీకరించింది.  ఇవాళ తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్లు జరిగినట్లు తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

రాజౌరి జిల్లాలోని లాథి గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరో ఎన్‌కౌంటర్ ప్రస్తుతం కొనసాగుతోంది.  ఆ ఏరియాలో దాదాపు నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల సంచారం ఉందనే సమాచారం అందడంతో కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈక్రమంలోనే ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌లో(Kashmir) సెప్టెంబర్ 18, సెప్టెంబరు 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈనేపథ్యంలో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారు. దీనిపై భారత నిఘా వర్గాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుండటంతో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

Also Read :CM Revanth : మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి హైడ్రా నోటీసులు

బారాముల్లా ఎంపీ రషీద్ ఇంజినీర్‌ బెయిల్‌ వ్యవహారం

ఓ వైపు కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంటే.. మరోవైపు యూఏపీఏ కేసులో బారాముల్లా ఎంపీ రషీద్ ఇంజినీర్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) వాదన వినిపిస్తోంది. రషీద్ ఇంజినీర్‌ జైలులో ఉండగానే కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి ఎంపీ అయ్యారు. ఇప్పుడు తనకు బెయిల్ కావాలంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో రషీద్ పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ఒకవేళ రషీద్‌కు బెయిల్ ఇస్తే ఆయన తన ఎంపీ పదవిని వినియోగించుకొని సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రషీద్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. 26/11 ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ వంటి వారిని సమర్ధించిన నేపథ్యం కలిగిన రషీద్ ఇంజినీర్‌కు బెయిల్ ఇవ్వడం మంచిది కాదని ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదన వినిపించారు.

Also Read :High Blood Pressure: మీరు అధిక రక్తపోటుతో బాధ‌పడుతున్నారా..? అయితే ప్రతిరోజూ ఈ యోగా ఆసనాలను చేయండి..!